రాలిపోతున్న ఆకును చూసి కొమ్మ‌కు ఉన్న ఆకు న‌వ్వింద‌ట‌..! పాపం.. తాను కూడా ఏదో ఒకరోజు రాలిపోక‌త‌ప్ప‌ద‌న్న విష‌యాన్ని మ‌రిచిపోయింది. తెలంగాణ రాజ‌కీయాల్లో అధికార పార్టీకి చెందిన ఓ నేత ప‌రిస్థితి ఇలాగే ఉందిప్పుడు. ప్ర‌జ‌ల్లోకి వెళ్దామంటే సొంత నియోజ‌క‌వ‌ర్గం లేదు. పిల‌వ‌ని పేరంటానికి పోతే ఉన్న‌ప‌రువు కాస్త పోతుందేమోన‌న్న భ‌యం.. ఎవ‌రో ఒక‌రు..ఏదో ఒక కార్య‌క్ర‌మానికి పిలిస్తే వెళ్ల‌డం.. లేకుంటే ఇంటికే ప‌రిమితం కావ‌డం.. టీడీపీ ప్ర‌భుత్వ‌ హ‌యాంలో ఆయ‌న మంత్రిగా ఉన్న‌ప్పుడు రాజ‌కీయాల్లో అ, ఆలు దిద్దుతున్న‌వారంద‌రూ నేడు పొడుగుపొడుగు ముచ్చ‌ట్లు చెబుతున్నారు. అయినా.. రాజకీయాల్లో త‌ల‌పోట్లు... ఆటుపోట్లు.. వెన్నుపోట్లు.. అన్నింటికీ మించి కుల‌పోట్లు.. కాల‌చ‌క్రంలా తిరుగుతూనే ఉంటాయి. సారీ..సారీ.. ఏకాలం ఎప్పుడు వ‌స్తుందో చెప్పొచ్చుగానీ.. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎక్క‌డు ఎవ‌రు ఎటువైపు నుంచి న‌రుక్కొస్తారో.. ఎటువైపు నుంచి ఏ పోటు పొడుస్తారో.. ఊహ‌కంద‌ని విష‌య‌మే మ‌రి. రాజకీయ భ‌విష్య‌త్ కొనూపిరితో కొట్టుకుంటున్న‌ప్పుడుగానీ విష‌యం బోధ‌ప‌డే అవ‌కాశం ఉంటుంది..!

 

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ఓ సీనియ‌ర్ నేత ఇప్పుడు ఇదే ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ఆయ‌న మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. అప్పటి ప్ర‌భుత్వంలో కీల‌క‌పాత్ర పోషించారు. ఎంతో స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రించారు. అవినీతిమ‌చ్చ‌లేని నేత‌గా గుర్తింపు పొందారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత టీడీపీ మొత్త‌మే డీల పడిపోవ‌డం.. పార్టీ మ‌నుగ‌డ క‌ష్ట‌మ‌వుతున్న కాలంలో టీఆర్ఎస్‌లోకి వ‌చ్చారు. ఎంపీ అయ్యారు. ఆ త‌ర్వాత అనూహ్యంగా వ‌చ్చిన అవ‌కాశంతో సీఎం త‌ర్వాతి స్థానం ద‌క్కింది. త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసి, ఎమ్మెల్సీ అయి ఆ  హోదాలో హ‌ల్‌చ‌ల్ చేశారు. కానీ, కాలం గిర్రున తిరిగివ‌చ్చింది. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చాక ఆ ప‌ద‌వుల జాడ‌లేదు. మొద‌టి మంత్రివ‌ర్గంలో స్థానం ద‌క్క‌లేదు. రెండోమంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఛాన్స్ గ్యారంటీ అనుకున్నారు. కానీ నిరాశే ఎదురైంది. తాజాగా, రాజ్య‌స‌భ‌కైనా పంపిస్తారేమోన‌ని ఆశ‌ప‌డ్డారు. కానీ.. అదికూడా క‌ష్ట‌మే. దీంతో ప్ర‌స్తుతం సైలెంట్‌మోడ్‌లో ఉన్నారు. ఎవ‌రికీ గొర‌గాకుండా పోతున్నారు. ఆనాడు అ, ఆలు దిద్దిన నేత‌లు నేడు  ప్ర‌సంగాలు దంచికొడుతుంటే.. చిన్న‌బోయి వింటున్నారు. రాజ‌కీయాలంటే ఇలాగే ఉంటాయిమ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: