పాపం.. ఆ మాజీ ఎంపీ! ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు.. అనేక అవ‌మానాల‌ను త‌ట్టుకున్నారు.. ఏదో ఒక‌రోజు త‌న‌కు అవ‌కాశం ద‌క్కుతుంద‌ని గ‌ట్టిగా న‌మ్మారు.. అంతే వేగంగా ఆశ‌లు చిగురించాయి. ఆ ప‌ద‌వి వ‌చ్చెవ‌చ్చె.. ఖాయం.. ఖ‌రారు..! ఇక అధినేత ప్ర‌క‌టించ‌డమే త‌రువాయి అంటూ వార్త‌లు.. ఇవ‌న్నీ చూసి చెంగున ఎగిరారు. పొంగులుపొంగారు. ఆహా.. ఇక‌ త‌న‌కు తిరుగులేద‌ని ఎగిరిగంతేశారు. పాపం..! ఆఖ‌రి క్ష‌ణంలో మింగుడుప‌డ‌ని ముచ్చ‌ట చెవిలో బుర్రున జొర్ర‌డంతో క‌ర్ణ‌భేరి బ‌ద్ద‌లై గింగిరాలు తిరిగారు. ఏం చేస్తాం మ‌రి.. రాజ‌కీయాలంటే ఇలాగే ఉంటాయి మ‌రి. ఇంత‌కీ ఎవ‌రి గురించి ఈ ముచ్చ‌ట అని అనుకుంటున్నారా..? ఆయ‌న మ‌రెవ‌రో కాదు.. తెలంగాణ‌లో అధికార పార్టీకి చెందిన ఓ మాజీ ఎంపీ. ఆశ‌లు నిలువునా కూలిపోయి గులాబీ తోట‌లో ఎర్రిపూగా మిగిలిపోయిన ఆయ‌న మ‌నసులో ఎన్నో ఆవేద‌న‌లు.. మ‌రెన్నో ఆక్రంద‌న‌లు.. ఇంకెన్నో..! ఖ‌మ్మం జిల్లాకు చెందిన‌ మూడు త‌ల‌ల క‌ల‌బోత వ్యూహంలో చిక్కుకుని కుక్కిన పేనులా మారిపోయారు. అంతా భ్రాంతియేనా.. జీవితానా వెలుగుండేనా.. అంటూ ఓ గీతం ఆయ‌న‌ను ఇప్పుడు ఓదార్చుతోంది!

 

 వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి.. అధికార గులాబీ గూటికి చేరారు. ఐదేళ్ల‌పాటు హ‌ల్‌చ‌ల్ చేశారు. అధినేత‌ల‌కు తానెంతో ద‌గ్గ‌రివాడిన‌ని చూపించుకునే ప్ర‌య‌త్నం చేశారు. కానీ.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో అధినేత‌లు ఆయ‌నను దూరం పెట్టార‌నే విష‌యం స్ప‌ష్ట‌మైంది. ఇక ఆ త‌ర్వాత నుంచి పార్టీలో సైలెంట్‌గానే ఉంటున్నారు. ప‌క్క‌చూపులు చూడ‌లేని ప‌రిస్థితి. ఒక‌వేళ  చూసినా.. ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా మారుతుంద‌న్న విష‌యం ఆయ‌నకు స్ప‌ష్టంగా తెలుసు. ఇక రాజ్య‌స‌భ‌కైనా పంపిస్తార‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. సానుకూల సంకేతాలు కూడా అందాయి. మీడియా కూడా తెగ హ‌డావుడి చేసింది. ఇదంతా చూసి మంచిరోజులు వ‌చ్చాయ‌ని అన‌కున్నారు. రాజ్య‌స‌భ‌లో అడుగుపెట్ట‌డం ఖాయ‌మ‌ని సంబుర‌ప‌డ్డారు. కానీ.. అంత‌లోనే నిలువునా ముంచేసే వార్త రానే వ‌చ్చింది. అవ‌కాశాన్ని మ‌రెవ‌రో త‌న్నుకుపోయారు. రాజ‌కీయాల్లో మ‌జా అంటే ఇదేమ‌రి. ఎప్పుడు ఎవ‌రు ఏ రూపంలో ఎర్రిపూగా మిగిలిపోతారో చెప్ప‌డం అంత సుల‌భం కాదుసుమా..!

మరింత సమాచారం తెలుసుకోండి: