ఉత్త‌మ్‌.. చిత్తం ప్ర‌భూ! ఖాయం.. ఉన్న పోస్టు కాస్త ఊడిపోవ‌డం ఖాయం..! హ‌స్తంలో చిత్తుకాగితంలా మిగిలిపోవ‌డం ఖాయం! పొత్తులు పెట్టి, ఏతులు కొట్టినా ఉట్టిచేతులే! ఆహా..ఈసారి మీదే పీఠం.. అంటూ మీడియా కూత‌లు.. చూశారా అంటూ కోత‌లు.. చివ‌రికి ఒళ్లంతా వాత‌లు! అబ్బా.. అబ్బ‌బ్బా.. అంటూ ఈవీఎంల‌పై నింద‌లు! చిందులు! హ‌జూర్‌న‌గ‌ర్ దెబ్బ‌తో దిమ్మ‌దిరిగి బొమ్మ‌క‌న‌ప‌డె! ప‌డిపోయిన రూపాయి విలువ‌లా.. కుప్ప‌కూలిన స్టాక్‌మార్కెట్‌లా..! ప‌డిపోయిన మాట విలువ‌! ఇక‌ ఎన్ని ఎత్తులు పెట్టినా సొంత‌గూటిలో ఉత్త‌ముచ్చ‌టే! పీత‌ల మ‌ధ్య వేగ‌లేక.. కొత్త‌గా చెప్పేది లేక‌.. గెడ్డం తీయ‌లేక‌.. మీడియా ముందుకు రాలేక‌.. చేతులెత్తేసిన‌ రాజ‌కీయం! జీవితం హ‌స్త‌వ్య‌స్తం..! పాపం.. ఆఖ‌రికి ఒక్క న‌ల్ల‌గొండనే అండ‌గా నిలిచింది. సొంత ఎజెండాల రేవంత్‌, పొంత‌న‌లేని హ‌నుమంత‌రావు, పొడుగుముచ్చ‌ట కోమ‌టిరెడ్డి, ప‌క్క సూపుల రాజ‌గోపాల్‌రెడ్డి.. ఎగిరెగిరి ప‌డే జ‌గ్గారెడ్డి.. అబ్బో.. ఇలా ఎంద‌రో ఉత్త‌మ్ ప‌ద‌వికి ఎస‌రుపెట్టే ప‌నిలో బిజీగా ఉన్నారే టాక్ టిక్‌టాక్‌లా వైర‌ల్ అవుతోంది. ఏ స‌మ‌యంలోనైనా.. ఉత్త‌మ్‌కు టాటా చెప్ప‌డం ఖాయ‌మంటూ బుస‌లుకొడుతున్న గుస‌గుస‌లు! 

నిజానికి.. ఉత్త‌మ్ చేతికి ప‌గ్గాలు వ‌చ్చిన త‌ర్వాత పార్టీ కొంత బ‌లోపేతం అయిన‌ట్టే క‌నిపించింది. అంద‌రూ క‌లిసిన‌డిచిన‌ట్టే అనిపించింది. జ‌నంలోనూ పాజిటివ్ టాక్ మొద‌లైంది. కానీ, అది కాంగ్రెస్‌! హ‌స్త‌వ్య‌స్తానికి చిరునామా! చింద‌ర‌వంద‌ర రాజ‌కీయగంద‌ర‌గోళానికి నిద‌ర్శ‌నం..!  ముందుకెళ్తే తంత‌రు.. వెన‌క్కొస్తే పొడుస్త‌రు..! ఎప్పుడు ఎవ‌రిని విమ‌ర్శిస్తారో.. మ‌రెవ‌రిని పొగుడుతారో అంతుచిక్క‌దు. ఒక‌రు ఔనంటే..మ‌రొక‌రు కాదంటరు..! ఇలా పార్టీ ఎజెండాకంటే.. సొంత ఎజెండానే ముంద‌టేసుకుని మందిలోకి వెళ్ల‌డంలో వాళ్ల‌కు వాళ్లే సాటి.  అందివ‌చ్చిన అవ‌కాశాలను చేజేతులా బొంద‌పెట్టుకోవ‌డంలో అంద‌రూ పోటీదారులే! ఇక ఇటీవ‌లే భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ అధినేత్రి సోనియాగాంధీని క‌లిసిన త‌ర్వాత ఉత్త‌మ్ ప‌ద‌వి పోవ‌డం ఖాయ‌మ‌నే ఊహాగానాలు మ‌రింత‌గా ఊపందుకున్నాయి. నిజానికి.. కొద్దిరోజులుగా టీపీసీసీ చీఫ్ ప‌ద‌విలో ఉత్త‌మ్ కూడా అయిష్టంగానే కొన‌సాగుతున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌కు కొత్త సార‌థి రావ‌డం ఖాయ‌మ‌ని తేలిపోయింది. ఇక ఇదే ప‌ద‌వి రేసులో ఉన్న రేవంత్ డ్రోన్ కేసులో జైలుకెళ్ల‌డంతో ప‌రిణామాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఉత్త‌మ్ రాజ‌కీయ జీవితం ఎలాంటి మ‌లుపుతిరుగుతుందో చూడాలి మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: