చివరకు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు ఇలాగైపోయాడన్నమాట. రాష్ట్రలో ఎటువంటి మంచి జరిగినా తన వల్లే తన వల్లే అని డప్పు కొట్టుకునే స్ధాయికి దిగజారిపోయాడని తాజాగా జరిగిన టిడిపి జనరల్ బాడీ సమావేశంలో తేలిపోయింది. అసలు కరోనా వైరస్ సంక్షోభం సమయంలో పార్టీ జనరల్ బాడీ సమావేశం ఆన్ లైన్లో నిర్వహించటమే విచిత్రంగా ఉంది.  ఆడియో అయినా వీడియో కాన్ఫరెన్సయినా ఒకేసారి వందలమందితో మాట్లాడటమంటే చంద్రబాబుకు మహా సరదా. ఇపుడు జనరల్ బాడీ సమావేశం కూడా ఇలాగే జరుగుంటుంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే కరోనా వైరస్ సంక్షోభం గురించి మాట్లాడుతూ ఎవరిళ్ళల్లో వాళ్ళు కూర్చుని దీక్షలు చేసిన తమ్ముళ్ళు, చెల్లెళ్ళను చంద్రబాబు అభినందించటమే విచిత్రం. ఎందుకు అభినందించాడంటే వీళ్ళ దీక్షల వల్ల ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిపోయిందట. తాము పెట్టిన ఒత్తిడి వల్లే పెన్షనర్లకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి డబ్బులు చెల్లించిందని చెప్పుకున్నాడు. వైసిపి ఎంఎల్ఏలు విచ్చలవిడిగా తిరగటం వల్లే రాష్ట్రంలో కరోనా వైరస్ పెరిగిపోయిందట. చంద్రబాబు చెప్పినట్లుగా తిరిగిన వైసిపి ఎంఎల్ఏలు మహా ఉంటే ఓ ఐదుగురుంటారంతే. ఈ ఐదుగురు వల్లే రాష్ట్రమంతా వైరస్ పెరిగిపోయిందని చెప్పటంమే విచిత్రంగా ఉంది.

 

పేదలు, కార్మికులు, పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు తమ్ముళ్ళు, చెల్లెమ్మలు మండలస్ధాయిలో కూడా దీక్షలు చేయలని కొత్తగా అజెండా ఫిక్స్ చేశాడు. కేరళలో వాలంటీర్లు లేకుండానే పేదలకు 17 రకాల నిత్యావసరాలు ఇస్తుంటే ఏపిలో వాలంటీర్లుండి కూడా నిత్యావసరాలు పంపిణి చేయలేకపోతున్నట్లు మండిపోయాడు. అంటే చాలా కాలంగా ఇటువంటి ఆరోపణలు చేసిందే చేస్తున్నాడు లేండి. వైరస్ సంక్షోభంలో కూడా ట్రస్టు పెట్టి విజయసాయిరెడ్డి బలవంతపు వసూళ్ళకు పాల్పడుతున్నట్లు ఆరోపించాడు. ఎవరి దగ్గర నుండి ఎంతెంత వసూళ్ళు చేశాడో మాత్రం చెప్పలేదు.

 

కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు తాను రాసిన లేఖల వల్ల కొన్ని మేళ్ళు జరిగినట్లు చెప్పుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. లేఖలతోనే మేళ్ళు జరిగిపోయేట్లయితే అధికారంలో ఉండి కూడా చాలా విషయాల్లో చంద్రబాబు ఎందుకు ఫెయిలైనట్లు ? ఆర్టీసీ, విద్యుత్, నీటితీరువాతో పాటు పెట్రోలు, డీజల్ ధరలు పెంచటం దారుణమంటూ మండిపోయాడు. నిజానికి పెట్రోలు, డీజల్ ధరలు పెరగటానికి రాష్ట్రప్రభుత్వాలకు సంబంధం లేదన్న విషయం కూడా మరచిపోయినట్లున్నాడు. ఇక మిగిలిన వాటి చార్జీల పెంచటమన్నది కరోనా వైరస్ కు ముందే పెరిగాయన్నది కూడా మరచిపోయాడు.

 

మొత్తం మీద చంద్రబాబు జనరల్ బాడి సమావేశం ఎందుకు పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టటానికే అని అర్ధమైపోతోంది. ఈ మాత్రానికి ప్రత్యేకంగా ఆన్ లైన్లో జనరల్ బాడీ సమావేశం పెట్టాలా ? రోజు తిడుతున్నది సరిపోలేదా ? బాధ్యత గల ప్రతిపక్షంగా జనాలకు నీవేం చేస్తారో చెప్పకుండా ప్రభుత్వాన్ని తిడితే వచ్చే ఉపయోగమేంటో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకే  తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: