ఎలాగూ లాక్ డౌన్ అమల్లో ఉంది కాబట్టి టీచర్లకు పనేమీ లేదని ప్రభుత్వం అనుకున్నట్లే ఉంది. అందుకనే కొత్తగా మరో బాధ్యతను అప్పగించింది. ఇప్పటికే క్వారంటైన్ కేంద్రాల్లో కొందరు టీచర్లతో పర్యవేక్షణ చేయిస్తోంది. దానికి అదనంగా మద్యం షాపుల దగ్గర తాగుబోతులను కంట్రోల్ చేసే డ్యూటి అదనంగా అప్పగించింది. ఇక్కడ తాగుబోతుల డ్యూటి అంటే మందు తాగినోళ్ళు సక్రమంగా ఇళ్ళకు చేరుకోవటం కాదండి. మందు కొనుక్కునేందుకు వచ్చిన వాళ్ళను సోషల్ డిస్టెన్సింగ్ పాటించేట్లు చూడటం, తోపులాటలు లేకుండా అందరినీ క్యూలైన్లలో నిల్చునేట్లు చేసే పర్యవేక్షణ బాధ్యత టీచర్లకు అప్పగించింది.

 

మద్యం షాపుల దగ్గర టీచర్లకు డ్యూటి వేయటం అనే మాట వినటానికే ఇబ్బందిగా ఉంది. అయ్యోర్లు స్కూళ్ళల్లో విద్యార్ధులకు పాఠాలు చెప్పాల్సిన వాళ్ళు. ఎన్నికల డ్యూటియో లేకపోతే ఓటర్ల నమోదు, సవరణ డ్యూటీలు వేయటం మామూలే. కరోనా వైరస్ సంక్షోభంలో క్వారంటైన్ కేంద్రాల దగ్గర పర్యవేక్షించే బాధ్యతను చాలా రాష్ట్రాల్లో టీచర్ల సేవలను ఉపయోగించుకుంటున్నారు. ఇందులో కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కరోనా వైరస్ పై యుద్ధమన్నది సామాజిక బాధ్యతగానే అందరూ చూస్తారు.

 

కానీ మద్యం షాపుల దగ్గర జనాల క్యూ లైన్లను రెగ్యులేట్ చేసే డ్యూటి అంటే వినటానికే విచిత్రంగా ఉంది. లాక్ డౌన్ కారణంగా  దాదాపు 50 రోజుల తర్వాత  మద్యంషాపులు తెరిచారు. దాంతో జనాలు కొత్త సినిమా టికెట్ కోసం ఎగబడినట్లు షాపుల మీద ఎగబడుతున్నారు. వీళ్ళని నియంత్రించటం పోలీసుల వల్లే కావటం లేదు. అలాంటిది టీచర్ల వల్ల ఎలా సాధ్యమవుతుందని ప్రభుత్వం అనుకుందో ఆశ్చర్యంగా ఉంది. అసలు పోలీసులకు అదనంగా టీచర్లకు డ్యూటిలు ఎందుకు వేస్తున్నట్లు ? ఎందుకంటే అవసరానికి సరిపడా పోలీసులు లేరు కాబట్టే. విశాఖపట్నం జిల్లాలో సుమారుగా 70 మంది టీచర్లకు అనధికారికంగా  డ్యూటిలు వేసినట్లు సమాచారం.

 

టీచర్లను ఇటువంటి డ్యూటిల్లో నియమించే బదులు ప్రతి కాలేజీలోను ఎన్సిసి క్యాడెట్లుంటారు. వాళ్ళందరినీ అత్యవసర విధుల క్రింద ట్రాఫిక్ కంట్రోలుకో లేకపోతే మరో పోలీసు విధుల్లోకి తీసుకోవచ్చు. మద్యం షాపుల దగ్గర డ్యూటి చేస్తున్న టీచర్లను వెంటనే తప్పించి వారి స్ధానంలో పోలీసులను ఉపయోగించుకోవచ్చు. ఎన్ సిసి క్యాడెట్ల సేవలను ఉపయోగించుకుంటే కొన్ని వేలమంది క్యాడెట్లు అందుబాటులో ఉంటారు. ట్రాఫిక్ రెగ్యులేట్ చేయటంలోనో లేకపోతే ఇంకెక్కడైనా అవసరమైన చోట్లో క్యాడెట్లతో డ్యూటి చేయిస్తే వాళ్ళకు కూడా కాస్త అనుభవం వస్తుంది. లేకపోతే ప్రభుత్వం అభాసు పాలవుతుందనటంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: