పేరుకే ఆయన సిపిఐ కార్యదర్శి. చేసే ఆరోపణలు, చేసే ఉద్యమాలు అన్నీ తెలుగుదేశంపార్టీ నేతలనే తలపిస్తుంటాయి. ఇంతకీ ఆయనెవరో పరిచయం చేయలేదు కదూ ఆయనే  రామకృష్ణ. తాజాగా మద్యం షాపులను తెరిచే విషయంలో  జగన్మోహన్ రెడ్డి పై ఆరోపణలు చేశాడు. ఆయన చేసిన ఆరోపణలకు, టిడిపి నేతలు చేస్తున్న ఆరోపణలకు ఏమాత్రం తేడా కనిపించటం లేదు. అందుకనే రామకృష్ణను టిడిపి ఆవహించిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే మద్యం షాపులకు లాక్ డౌన్ నిబంధనలు వర్తించవా ? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశాడు. కరోనా విపత్తు నేపధ్యంలో జనాలంతా మెడిసిన్స్  కోసం వెయిట్ చేస్తుంటే ప్రభుత్వం మద్యం సరఫరా చేయటం ఏమిటంటూ మండిపోయాడు. ఇక్కడ రామకృష్ణ మరచిపోయిన విషయం ఏమిటంటే లాక్ డౌన్ వేటికి వర్తిస్తుంది, వేటికి మినహాయింపులుంటాయనే విషయాన్ని ప్రకటించేది కేంద్రప్రభుత్వం. లాక్ డౌన్ కు, మినహాయింపులకు కేంద్రం జారీ చేసే గైడ్ లైన్స్ ను పాటించటమే రాష్ట్రప్రభుత్వాల బాధ్యత.

 

తాజాగా మద్యం షాపులకు లాక్ డౌన్ నుండి జోన్ల వారీగా షరతులతో కూడిన సడలింపులు ఇచ్చింది కూడా కేంద్రమే. దాని ప్రకారమే రాష్ట్రప్రభుత్వం మద్యం షాపులను తెరిచింది. జగన్ ఇష్టప్రకారమే మద్యం షాపులు తెరిచేట్లయితే బార్ అండ్ రెస్టారెంట్లను ఎందుకు తెరవలేదు ?  ఇంతచిన్న విషయాన్ని కూడా రామకృష్ణ ఆలోచించలేకపోతున్నాడంటే అందుకు కారణం చంద్రబాబు మాయలో పడిపోవటమే అని అర్ధమైపోతోంది.

 

నిత్యావసరాలకేమో ఉదయం 6-9 గంటల మధ్య వరకే అనుమతిస్తు, మద్యం షాపులకు మాత్రం ఉదయం 11 నుండి రాత్రి 7 గంటల వరకు అనుమతి ఇవ్వటమేంటనే లాపాయింటు కూడా ఈ కార్యదర్శి లాగేశాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మద్యం నిత్యావసరాల్లోకి రాదు. నిత్యావసరాలను కొనే వాళ్ళతో పోల్చుకుంటే మద్యాన్ని కొనే వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువే. అందుకనే ఎక్కువ సమయాన్ని ఓపెన్ చేయాలని అనుకున్నదేమో ప్రభుత్వం. అలాగే మద్యం ఎక్కడైపోతుందో, మళ్ళీ లాక్ డౌన్ పెట్టేస్తారేమో అన్న ఆందోళనలతోనే జనాలు ఎగబడుతున్నారు.

 

షాపులను తెరిచే విషయంలో కేంద్రం ఆదేశాలను పాటిస్తునే ధరలను పెంచేస్తు జగన్ సొంతంగానే నిర్ణయం తీసుకున్నాడు. ప్రజల ప్రాణాలకన్నా మద్యం ఆదాయం పైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందన్న ఆరోపణ కూడా పనికిమాలినదే. ఎందుకంటే ప్రభుత్వం నడవాలన్నా, సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నా ఆదాయం తప్పనిసరి. మద్యం ద్వారా ఆదాయం రావటమన్నది జగన్ ప్రభుత్వంతోనే మొదలు కాలేదన్న విషయం రామకృష్ణ గుర్తుపెట్టుకోవాలి.

 

చివరగా పేదలను ఆదుకోవలన్న డిమాండ్ తో రాష్ట్ర వ్యాప్తంగా మౌన దీక్షలు చేయాలన్న పిలుపు కూడా అచ్చంగా చంద్రబాబు పిలుపులాగే అనిపించటం లేదా ? మొత్తానికి రామకృష్ణను టిడిపి ఆవహించేసిందనటానికి ఇంతకన్నా వేరే  నిదర్శనం కావాలా ?

మరింత సమాచారం తెలుసుకోండి: