గుడ్డ కాల్చి ఎదుటివాళ్ళ మొహం మీదేస్తే వాళ్ళే తుడుకుంటారులే అన్నది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీ నేతల వైఖరి. పార్టీ అధినేత  చంద్రబాబునాయుడు దగ్గర నుండి నేతలు, ముఖ్యంగా అధికార ప్రతినిధుల వ్యవహారం ఇలాగే ఉంటోంది. వీళ్ళు చేసే ఆరోపణల్లో, విమర్శల్లో అసలు వాస్తవాలే ఉండవు. ఏదో గాలిని పోగేసి ప్రత్యర్ధులపై ఆరోపణలు చేసేయటమే టార్గెట్ గా పెట్టుకుంటారు. ఇటువంటి వాళ్ళల్లో అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఒకడు. ఇలాంటి పట్టాభి వైసిపి ఎంఎల్ఏకి అడ్డంగా దొరికిపోయి సమాధానం చెప్పలేక  చివరకు చేతులెత్తేశాడు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం ఎంఎల్ఏ కొట్టు సత్యనారాయణ ఇసుక అక్రమ రవాణాలో కోట్ల రూపాయలు దోచేసుకుంటున్నట్లు పట్టాభి ఓ ఎల్లోమీడియాలో ఆరోపణలు చేశాడు.  ఓ ఛానల్లో జరిగిన డిబేట్ లో కొట్టు దోపిడి చేస్తున్నట్లు బల్లగుద్ది మరీ వాదించాడు.  ఆరోపణలకు తన దగ్గర ఆధారాలున్నట్లు కూడా చెప్పాడు. దాంతో ఆరోపణల విషయం ఎంఎల్ఏ కొట్టు దృష్టికి వచ్చింది.

 

ఈ విషయమై వివరణ ఇచ్చేందుకు కొట్టు మీడియా సమావేశం పెట్టాడు. మీడియా సమక్షంలోనే ఎంఎల్ఏ టిడిపి అధికార ప్రతినిధి పట్టాభికి ఫోన్ చేశాడు. ఇసుక అక్రమంగా రవాణా చేయిస్తున్నట్లు, కోట్ల రూపాయలు దోపిడి చేస్తున్నట్లు  చేసిన ఆరోపణలకు ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేశాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్య మాటలు జరిగిన తర్వాత చివరకు తమ పార్టీలో పై నుండి వచ్చిన ఆదేశాల ప్రకారమే తాను ఆరోపణలు చేశానని చెప్పాడు. ఇసుక దోపిడి ఆరోపణల విషయంలో తన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవని కూడా ఒప్పేసుకున్నాడు.

 

తన ఆరోపణలకు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తే ఆధారమని బయటపెట్టాడు చివరకు. అయితే ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త కూడా తప్పేనని ఎంఎల్ఏ చెప్పినపుడు ఇక ఏమి మాట్లాడాలో తెలీని పట్టాబి ’రాజకీయాలన్నాక ఏవో ఆరోపణలు చేస్తుంటా’మంటూ  సమర్ధించుకున్నాడు. అలాగే  ’తాను చేసిన ఆరోపణలు తప్పైతే  అదే విషయాన్ని వివరణ ఇవ్వాలం’టూ ఓ ఉచిత సలహా కూడా ఇవ్వటమే విచిత్రం.

 

అంటే టిడిపి నేతలు చేస్తున్న ప్రతి ఆరోపణ కూడా గాలినిపోగేసి చేస్తున్నదే అని అర్ధమవుతోంది. నోటికొచ్చిన ఆరోపణలు చేసేసి ప్రత్యర్ధులపై బురద చల్లేస్తే వాళ్ళే కడుకుంటారులే అనే ధోరణితోనే చంద్రబాబు అండ్ కో రెచ్చిపోతోంది. టిడిపి తరపున టివి చర్చల్లో ఎక్కువగా పట్టాభే కనబడుతుంటాడు. మొదటి నుండి కూడా పట్టాభిది ఇదే పద్దతి. 24 గంటలూ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటం, ప్రభుత్వంపై బురద చల్లేయటం. వీళ్ళ వైఖరి కొట్టు సత్యనారాయణ ఫోన్ సంభాషణతో మరోసారి బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: