’పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును ఎన్టీయార్ మొదలుపెడితే నేను పూర్తి చేశాను’ ... ఇది చంద్రబాబు మీడియా సమావేశంలో చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు. చంద్రబాబు అబద్ధాలు చెబుతాడని అందరికీ తెలిసిందే. ప్రపంచంలో ఎక్కడ పాజిటివ్ అంశమైనా తన ఐడియానే అని అబద్ధం  చెప్పేయగల ధైర్యమున్నవాడు. అలాంటి చంద్రబాబు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును కూడా తానే పూర్తి చేసినట్లు చెప్పేశాడు. అంటే తాను చెబుతున్నది అబద్ధమా ? నిజమేనా ? అన్న సంశయం కూడా చంద్రబాబుకు ఉండదేమో ?

 

ఎందుకంటే అబద్ధాన్ని కూడా గోడకట్టినట్లు చెప్పేయగలిగిన నేర్పుంది. అదే సమయంలో కాదని చెప్పే మీడియా ఎలాగూ ప్రెస్ మీట్లో ఉండదు కాబట్టి ధైర్యం ఇంకా పెరిగిపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు 1977లో ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. 11,500 క్యూసెక్కుల సామర్ధ్యంతో వెంటనే పనులు కూడా ప్రారంభమైంది. 1983 నాటికే ప్రాజెక్టు ప్రారంభం కూడా అయిపోయింది. ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత ఎన్నికలు జరగటం కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోవటం అందరికీ తెలిసిందే.  ప్రాజెక్టు శిలాఫలకం దగ్గరకు ఎవరు వెళ్ళి చూసినా  ఈ విషయం కనబడుతుంది.

 

అలాంటి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు ఎన్టీయార్ ప్రాంభించటం ఏమిటి ? తర్వాత  చంద్రబాబు పూర్తి చేయటం ఏమిటి ?  అంటే కాంగ్రెస్ హయాంలో నిర్మితమైన ప్రాజెక్టును కూడా తాను పూర్తి చేసినట్లు చంద్రబాబు నిసిగ్గుగా చెప్పేసుకుంటున్నాడు. మంచి జరిగితే తన వల్లే అని చెడుజరిగితే మాత్రం ప్రత్యర్ధులపైకి నెట్టేయటం చంద్రబాబుకు బాగా అలవాటైన విద్య. జనాలు నవ్వుకుంటారన్న విషయాన్ని కూడా ఆలోచించకుండానే చంద్రబాబు చాలా తేలిగ్గా అబద్ధాలు చెప్పేస్తున్నాడు.

 

అలాగే తెలుగుగంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగిరి ప్రాజెక్టులను కూడా తామే పూర్తి చేసినట్లు చెప్పకుంటున్నాడు. నిజానికి పై ప్రాజెక్టుల పనులు ఇంకా జరుగుతునే ఉన్నాయి. పై ప్రాజెక్టుల్లో ఏది కూడా నూరుశాతం పూర్తి కాలేదు. నిజానికి పై ప్రాజెక్టుల్లో చాలా వరకు నీటికోసం రాయలసీమలో జరిగిన  ఉద్యమాల ఫలితంగా మొదలైనవే. అందులోను ఎన్టీయార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే పై ప్రాజెక్టులకు శంకుస్ధాపనలు జరిగాయి.

 

ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రయిన చంద్రబాబు ప్రాజెక్టులు పెద్దగా పట్టించుకోలేదు. 2004 వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే పై ప్రాజెక్టుల్లో కాస్త వేగంగా పనులు జరిగాయి. మళ్ళీ 2014-19 మధ్య అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రాజెక్టుల అంచనా వ్యయాలను భారీగా పెంచేసి దోచుకోవటంతోనే సరిపోయింది. వాస్తవాలు ఈ విధంగా ఉంటే ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ తానే పూర్తి చేసినట్లు ఎన్ని  అబద్ధాలు చెప్పుకుంటున్నాడో ?

మరింత సమాచారం తెలుసుకోండి: