తిరుమల తిరుపతి దేవస్ధానం ఆస్తుల అమ్మకం విషయంలో టిడిపి ఎంత గోల చేస్తోందో అందరికీ తెలిసిందే. మొత్తానికి మహానాడు సందర్భంగా ఆస్తుల అమ్మకం వెనకాల చంద్రబాబు బాధేమిటో అందరికీ అర్ధమైపోయింది.  బుధవారం మొదలైన రెండు రోజుల మహానాడు సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ’ఆస్తులు వేలం వేయాలని నిర్ణయించిన టిటిడి అందుకు  సమయం, సందర్భం చూసుకోవద్దా’ ? అంటూ మండిపడ్డాడు. కరోనా వైరస్ సంక్షోభంలో అసలు ఎవరి దగ్గర డబ్బులున్నాయని ఇపుడు టిటిడి ఆస్తులు వేలం వేస్తోందండి ? అంటూ నిలదీయటం నేతలందిరనీ ఆశ్చర్యంలొకి పడేసింది.

 

టిటిడి ఆస్తుల వేలం విషయంలో మంగళవారం వరకు టిడిపి వినిపించిన వాదనకు బుధవారం మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పూర్తి విరుద్ధంగా ఉంది. ఆస్తుల అమ్మకం విషయంలో టిడిపితో కలిసి ప్రతిపక్షాలు ఎంతగా గోల చేసింది అందరూ చూసిందే.  రాజకీయ పార్టీల నుండి వచ్చిన వ్యతిరేకత కారణంగా ఆస్తుల వేలం వేయాలన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. నిజానికి ఆస్తుల అమ్మకం విషయంలో నిర్ణయం తీసుకున్నదే టిడిపి హయాంలో. 2016లో అప్పటి బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ఇపుడు అమలు చేయాలని మాత్రమే వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన బోర్డు నిర్ణయించిందంతే.

 

వాస్తవం ఇలాగుంటే టిడిపి, బిజెపి, జనసేన, సిపిఐ మాత్రం ఆస్తుల అమ్మకం నిర్ణయం ఇపుడే తీసుకున్నట్లుగా కలరింగ్ ఇచ్చి బురద చల్లేస్తున్నారు. సరే అన్నీ పార్టీలు కూడా భక్తుల మనోగతమనే సెంటిమెంటును రంగరించటంతో ప్రభుత్వం కూడా అమ్మకం నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నది. ఇదే విషయమై చంద్రబాబు మాట్లాడుతూ ఆస్తుల అమ్మకం నిర్ణయాన్ని ఎవరు రివర్సు తీసుకోమన్నారు ప్రభుత్వాన్ని ? అంటూ మండిపడటమే విచిత్రంగా ఉంది. అంటే ఇపుడు ఆస్తులను  అమ్మాలన్న నిర్ణయమే మరి కొంతకాలం తర్వాత అమలు చేస్తే బాగుండేదన్న అర్ధమే చంద్రబాబు మాటల్లో వినిపించింది.

 

ఇక్కడ ఓ విషయం గుర్తుకు వస్తోంది. చంద్రబాబు హయాంలో తమిళనాడులోని  సదావర్తి సత్రం భూములను కారు చౌకగా అమ్మేసిన విషయం తెలిసిందే.  తన మద్దతుదారుడు రామానుజయ్యకు సుమారు 80 ఎకరాలను రూ. 22 కోట్లకే కట్టబెట్టేశాడు. అయితే ఈ విషయమై వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి అభ్యంతరం చెబుతు కోర్టులో కేసు వేశాడు. తర్వాత చాలా కాలం కేసు నడిచిన తర్వాత భూమిని నామినేషన్ మీద కాకుండా బహిరంగ వేలం ద్వారా మాత్రమే అమ్మాలని సుప్రింకోర్టు తీర్పు చెప్పింది. బహిరంగ వేలంలో అమ్మితే ఎక్కువ ధర వస్తే తన బండారం బయటపడుతుందన్న భయంతో చివరకు అమ్మకాన్నే పక్కన పెట్టేశాడు చంద్రబాబు.

 

అంటే ఇపుడు చంద్రబాబు మాటల్లో కూడా అటువంటి వైఖరే వినిపిస్తోంది. కరోనా సంక్షోభంలో ఆస్తులను వేలం వేస్తే ఎవరి దగ్గర డబ్బులున్నాయి ? ఎవరు కొంటారు ? అని అడుగాడే కానీ అసలు ఆస్తుల అమ్మటం తప్పని చెప్పటం లేదు. పైగా టిడిపి హయాంలోనే భూములు అమ్మాలని నిర్ణయించిందని వైసిపి బురద చల్లుతుందోని ఎదురు దాడి చేయటమే విచిత్రంగా ఉంది. ఆస్తులను అమ్మాలని టిటిడి 2016లో నిర్ణయించిందంటే అప్పుడు అధికారంలో ఎవరున్నారు ? అన్నది జనాలు మరచిపోయారని చంద్రబాబు అనుకుంటున్నాడేమో ?  మొత్తం మీద ఆస్తుల వేలం విషయంలో అసలు గుట్టును చంద్రబాబు బయటపెట్టేశాడనే చెప్పాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: