విశ్వవిఖ్యాత నటుడు, తెలుగుదేశంపార్టీ వ్యవస్ధాపకుడైన నందమూరి తారక రామారావు (ఎన్టీయార్) కు భారతరత్న ఇవ్వాలనే  డిమాండ్ పెద్ద జోక్ అయిపోయింది. తాజాగా ముగిసిన రెండు రోజుల డిజిటల్ మహానాడులో  కూడా ఒకరిద్దరు నేతలు ఎన్టీయార్ కు భారతరత్న డిమాండ్ చేయగానే చంద్రబాబునాయుడు కూడా రెడీ అన్నాడు. ఎన్టీయార్ కు భారతరత్న ఇప్పించేందుకు పార్టీ ఎప్పటి నుండో కృషి చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో కూడా మరింతగా కృషి చేద్దామంటూ హామీ ఇవ్వటమే పెద్ద జోక్

 

ఎందుకంటే ఎన్టీయార్ కు నిజంగానే భారతరత్న ఇప్పించాలనే పట్టుదల టిడిపిలో ఉందా అన్నదే అన్నగారి అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. రాష్ట్రపతులను నిర్ణయించానని, ప్రధానమంత్రులను డిసైడ్ చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబుకు ఎన్టీయార్ కు భారతరత్న ఇప్పించటం ఏమంత కష్టం ?  ఎప్పుడో వాజ్ పేయ్ లేకపోతే దేవగౌడ, ఐకే గుజ్రాల్ హయాంలోనే ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారం ఇప్పించలేకపోయాడా ?  మరెందుకు అన్నగారికి భారతరత్న రాలేదు ?

 

ఇదే విషయం మీద లక్ష్మీపార్వతి ఆమధ్య మాట్లాడుతూ ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారం రావటం చంద్రబాబుకే ఇష్టం లేదని ఆరోపించిన విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు వైఖరి చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఎందుంటే ఇప్పటికి ఎన్టీయార్ చనిపోయిన తర్వాత కూడా ఎన్ని మహానాడులు జరిగుంటాయి ? ప్రతి మహానాడులోను ఎన్టీయార్ కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్లు చేయటం, తీర్మానాలు చేయటం తప్పించి వచ్చేందుకు తీసుకున్న గట్టి చర్యలు ఏమున్నాయో ఎవరికీ తెలీదు.

 

కారణాలు ఏవైనా కానీండి ఎన్టీయార్ వ్యవహారం మాత్రం జనాలకు పెద్ద జోక్ లాగ తయారైపోయింది. భారతరత్న ఇప్పించాలనే డిమాండ్ చేయటంలో నేతలకు ఎలా విసుగు అనిపించటం లేదో కృషి చేస్తున్నామని చెప్పటానికి చంద్రబాబులో కూడా ఎలాంటి విసుగు కనిపించటం లేదు. తాజా మహానాడులో ఇదే విషయమై కొసమెరుపు ఏమిటో తెలుసా ? ఎన్టీయార్ కు భారతరత్న ఇప్పించాలని సాయిబాబు అనే నేత డిమాండ్ వినిపించాడు. ఆ తర్వాత మాట్లాడిన ఎన్టీయార్ పుత్రరత్నం హిందుపురం ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణ మాత్రం అసలా డిమాండ్ నే పట్టించు కోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: