అందితే.. జుట్టు.. అంద‌క‌పోతే.. కాళ్లు.. అనే సామెత‌ను టీడీపీ నాయ‌కులు రుజువు చేస్తున్నారు. నిజానికి ఇటీవ‌ల కాలంలో డ‌బుల్ గేమ్ ఎక్కువైపోయింది. త‌మ అధినేత త‌మ మాట విన‌క‌పోతే.. త‌మ‌కు స‌న్నిహితంగా ఉండే సోష‌ల్ మీడియాతోనో.. వెబ్ ఛానళ్ల‌కో లీకులు ఇస్తారు. ఇంకేముంది.. బ్ర‌హ్మాండం ఏదో బ‌ద్ద‌లై పోతోంద‌ని చెబుతారు. పాపం.. ఇదే నిజ‌మ‌ని న‌మ్మే సోష‌ల్ మీడియా జ‌నాలు, వెబ్‌, ఆన్‌లైన్ మీడియా వారు.. వీరికి వ‌త్తాసు ప‌లుకుతారు. మొత్తంగా ఇదో పెద్ద ర‌గ‌డ‌కు దారి తీస్తుంది. ప‌ని అయితే.. ఒక విధంగా ప‌నికాకుంటే.. మ‌రో విధంగా ప్లేటు ఫిరాయించ‌డం ఇటీవ‌ల కాలంలో కామ‌న్‌గా మారింది.

 

విజ‌య‌వాడ‌కు చెందిన ఓ యువ నాయ‌కుడి విష‌య‌మే చూద్దాం. ఈయ‌న కొన్నాళ్ల కింద‌ట వ‌ర‌కు టీడీపీలో ఉన్నారు. విజ‌య‌వాడ‌కు స‌మీపంలోని ఓ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం.. టీడీపీలో త‌న‌కు ప్రాధాన్యం ల‌భించ‌డం లేద‌ని గ్ర‌హించి.. సోష‌ల్ మీడియాకు, ఆన్‌లైన్ చానెళ్ల‌కు లీకులు ఇచ్చారు. ఇంకేముంది.. పార్టీ మారిపోతున్నారు.. అని! దీనిలో వాస్త‌వం లేకుండా పోతుందా? అనుకుని ఆయా చానెళ్లు.. వేదిక‌లు స‌ద‌రు యువ నేత పార్టీ మారుతున్నాడ‌ని ప్ర‌చారం చేశారు. ఈ క్ర‌మంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు దిగివ‌చ్చి.. త‌మ కోరిక‌లు తీరుస్తాడ‌ని భావించారు.

 

అయితే, స‌ద‌రు యువ నేత విష‌యంలో బాబు స్పందించ‌లేదు. ఎందుకంటే.. ఇక్క‌డ టీడీపీకి బ‌ల‌మైన కేడ‌ర్ ఉండ‌డం, మ‌రో కీల‌క నేత ద‌శాబ్దాలుగా పార్టీలోనే ఉండ‌డం. దీంతో సోష‌ల్ మీడియాలో వార్త‌లు రాయించుకున్న స‌ద‌రు యువ నేత‌.. ముందు ఖండించినా.. త‌ర్వాత పార్టీ మారిపోయారు. ఇక‌, ఇప్పుడు తాజాగా ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావు.. విష‌యంలోనూ సోష‌ల్ మీడియా స‌హా ఆన్‌లైన్ మాధ్య‌మాల్లో ఆయ‌న పార్టీ మారుతున్నాడంటూ.. క‌థ‌నాలు వ‌చ్చాయి. నిజానికి వారం ప‌ది రోజుల నుంచి ఈ వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రీముఖ్యంగా మ‌హానాడు స‌మ‌యంలోనూ ఈ వార్త‌లు వ‌చ్చాయి.

 

అయితే, ఆ స‌మ‌యంలో ఏలూరి వారు స్పందించ‌లేదు. అయ్యో.. నాపై ఇలా ఎందుకు రాస్తున్నారు? అని ఆయ‌న ప‌న్నెత్తు మాట కూడా అన‌లేదు. ప‌రుచూరులో వైసీపీకి బ‌ల‌మైన అవ‌స‌రం ఉంది. అదేస‌మ‌యంలో టీడీపీలో బాబు సామాజిక వ‌ర్గ‌మే అయిన‌ప్ప‌టికీ.. ఏలూరికి పెద్ద‌గా గుర్తింపు లేదు. ఈ ప‌రిణామాలు అంద‌రికీ తెలిసిన‌వే. అయితే, పార్టీ మార్పు విష‌యంలో త‌న ప్ర‌మేయం లేకుండానే.. వార్త‌లు వ‌చ్చాయ‌ని.. తాజాగా ఏలూరి వారు చెప్పుకొచ్చారు. మ‌రి అంత‌గా త‌న ప్ర‌మేయం లేన‌ప్పుడు ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు వెయిట్ చేశారు?  స‌రే.. మ‌రి కేసులు పెట్టొచ్చుగా?  పోనీ.. ఎవ‌రు దీని వెనుక ఉన్నారు చెప్పుకోవ‌చ్చుగా..? అంటే.. వాటికి మాత్రం అంతా సైలెంట్ అన్నారు ఏలూరి.. ఏదేమైనా ఇవాల్టి రోజుల్లో..మీడియాను త‌మ‌కు న‌చ్చిన విధంగా మార్చుకోవ‌డం ప‌రిపాటి అయిపోయింద‌న్న‌మాట‌.  దుష్ప్ర‌చారం తామే చేయించుకుని, త‌ర్వాత‌.. దుష్ప్ర‌చారం చేస్తున్నారంటూ.. ఎదురుదాడి! ఇదీ.. నేత‌ల నీతులు.!!

మరింత సమాచారం తెలుసుకోండి: