సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డి తన బాధేమిటో బయటకు చెప్పుకోలేకపోతున్నాడనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. గడచిన ఏడాది కాలంగా జేసీ వ్యాఖ్యలు చూస్తుంటే అందరిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దశాబ్దాల వ్యాపార సామ్రాజ్యాలు దెబ్బతింటున్న బాధ జేసీలో బాగా కనబడుతోందని అంటున్నారు. ఎవరు అధికారంలో ఉన్న వాళ్ళ వ్యాపారాల గురించి ఎవరూ పట్టించుకోలేదు. దాంతో వ్యాపారాల ముసుగులో వాళ్ళేం చేసినా ఇంతకాలం చెల్లిపోయింది. అయితే మొదటిసారి 2019లొనే వాళ్ళ వ్యాపారాల్లోని లొసుగులు బయటకు రావటం మొదలైంది. దాన్నే జేసి జీర్ణించుకోలేకపోతున్నట్లున్నాడు.

 

1983లో అనంతపురం జిల్లాలో తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయంగా మొదటి అడుగు వేశాడు. స్వతంత్ర అభ్యర్ధిగా పోటి చేసిన దివాకర్ రెడ్డి,  తెలుగుదేశంపార్టీ అభ్యర్ధి ముత్యాల కేశవరెడ్డి చేతిలో ఓడిపోయాడు. అయితే 1985లో వచ్చిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటి చేశాడు. స్వతంత్ర అభ్యర్ధిగా ఉంటే కష్టమని ఏదో ఓ పార్టీలో చేరితేనే భవిష్యత్తుంటుందని భావించే కాంగ్రెస్ లో చేరాడు. దానికి తగ్గట్లే 1985లోనే ఉపఎన్నికలు రావటం, కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటి చేయటంతో గెలిచాడు.

 

ఎప్పుడైతే 1985 ఉప ఎన్నికల్లో గెలిచాడు అప్పటి నుండి వెనక్కుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 1989, 1994, 1999, 2004, 2009 ఎన్నికల వరకూ వరుసగా ఆరుసార్లు గెలిచాడు.  అధికారంలో కాంగ్రెస్ ఉన్నా టిడిపి ఉన్నా నియోజకవర్గంలో ఆధిపత్యానికి ఢోకా లేకపోవటంతో  ఎదరునిలిచే వాళ్ళే లేకపోయారు. మధ్యలో టిడిపి హయంలో జిల్లాలో పరిటాల రవి రూపంలో గట్టి ప్రత్యర్ధి ఎదురైనపుడు జేసి ఇబ్బందిపడింది వాస్తవమే అయినా అది కొంత కాలమే.

 

2019లో జగన్ సిఎం అవ్వటంతో పాటు తమ వారసులు ఓడిపోయారనే కచ్చ జేసిలో బాగా పెరిగిపోయింది.  దాంతో  దివాకర్ మీడియా కనిపిస్తే చాలు జగన్ పై  నోటికొచ్చింది మాట్లాడేస్తున్నాడు. అందులోను తమ కుటుంబం ఆదాయానికి ఆయువుపట్టయిన జేసీ ట్రావెల్స్ వరుసగా వివాదాల్లో చిక్కుకోవటాన్ని సోదరులు తట్టుకోలేకపోతున్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా 2019 వరకు ట్రావెల్స్ లో ఏమి జరిగినా ఎవరూ అడగలేదు. అలాంటిది ప్రతిపక్షంలోకి రాగానే ట్రావెల్స్ లో మోసాలు బయటపడటం, వరుసగా అధికారులు దాడులుచేసి బస్సులను సీజ్ చేస్తుండటంతో ట్రావెల్స్  దాదాపు మూత పడినట్లే.

 

దశాబ్దాల తరబడి తమకు ఆదాయాన్ని తెచ్చిపెట్టిన ట్రావెల్స్ దెబ్బ తినటంతో, మైన్స్ లో జరుగుతున్న మోసాలు బయటపడటంతో చివరకు మైనింగ్ విషయంలో కూడా అధికారులు గట్టిగా బిగించేశారు. దాంతో ఆ కోపాన్ని దివాకర్ ముఖ్యమంత్రిపై చూపిస్తున్నాడా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మాజీ ఎంపి వరస చూస్తుంటే జగన్ను సిఎంగా తట్టుకోలేకపోతున్నాడా ? లేకపోతే తాము ప్రతిపక్షంలో కూర్చోవటాన్ని తట్టుకోలేకపోతున్నాడా ? అన్నది అర్ధం కావటం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: