మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మరో వివాదంలో ఇరుక్కున్నాడు. ఓ మహిళా అధికారిని పట్టుకుని నోటికొచ్చినట్లు మాట్లాడటం సంచలనంగా మారింది. ఓ ఫొటో ను తొలగించిన వివాదంలో మహిళా కమీషనర్ తోట కృష్ణవేణి ని బట్టలూడదీసి కొడతానంటూ చేసిన పదిమందిలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మాజీ మంత్రి బెదిరింపులపై కమీషనన్ ఫిర్యాదుతో పోలీసులు అయ్యన్నపాత్రుడిపై నర్భయ కేసు నమోదు చేశారు. బహుశా మాజీమంత్రి హోదాలో ఉన్న ఓ సీనియర్ నేతపై పోలీసులు నిర్భయ కేసు పెట్టడం ఇదే మొదటిసారేమో.

 

అసలు ఇంతకీ ఏమి జరిగిందంటే నర్సీపట్నం మున్సిపల్ ఆఫీసు సమావేశం హాలులో అయ్యన్నపాత్రుడి తాత లత్సాపాత్రుడి ఫొటో ఉంది. ఆ ఫొటోను కొద్ది రోజుల క్రితం అధికారులు ఛైర్మన్ చాంబర్లోకి మార్చారు. ఆ విషయం తెలియగానే అయ్యన్నపాత్రుడు వెంటనే మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని కమీషనర్ తో గొడవకు దిగాడు. సమావేశపు హాలులో పెయింటింగ్ జరుగుతోందని ఆ పనులు అయిపోగానే ఫొటోను తీసుకొచ్చి మళ్ళీ సమావేశం హాలులో పెడతామని కమీషనర్ కృష్ణవేణి చెప్పినా వినకుండా అయ్యన్న నోటికొచ్చినట్లు తిడుతునే ఉన్నాడు.

 

చివరకు కమీషనర్ ను బెదిరింపు ధోరణిలో మాట్లాడుతూ పనులు అయిపోగానే ఫొటోను సమావేశపు హాలులో పెట్టకపోతే బట్టలూడదీసి కొడతానంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగ మారింది. అయ్యన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దాంతో అవమానంగా భావించిన కమీషనర్ అయ్యన్నపై ముందు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. తర్వాత పోలీసుల ముందు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయటంతో అయ్యన్నపాత్రుడిపై నిర్భయ చట్టం క్రింద ఐపిసి  354-ఎ(4), 500, 504, 5050(1),బి, 505(2), 506, 509 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.

 

అధికారులను నోటికొచ్చినట్లు మాట్లాడటం అయ్యన్నకు ఇదే మొదటిసారి కాదు. అధికారంలో ఉన్నా లేకపోయినా అధికారులపై నోరు పారేసుకోవటం చాలా సహజం. మంత్రిగా ఉన్న సమయంలోనే ఆర్డీవో, ఎంఆర్వోలతో పాటు ఎంతో మంది పోలీసు అధికారులను నోటికొచ్చినట్లు తిట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాకపోతే అప్పట్లో అధికారంలో ఉన్నాడు కాబట్టి ఏమి మాట్లాడినా చెల్లిపోయింది. అయితే ప్రస్తుతం తాను ప్రతిపక్షంలో ఉన్న విషయంతో పాటు నిర్భయ చట్టం ఉందన్న విషయాన్ని బహుశా అయ్యన్న మరచిపోయినట్లున్నాడు.

 

ఓ మహిళా కమీషనర్ ను పట్టుకుని అందరిలోను బట్టలూడదీసి కొడతానని అనటం ఏమి సభ్యతో అయ్యన్నకే తెలియాలి. పైగా ’కమీషనర్ ఆడమనిషి అయిపోయింది కాబట్టి సరిపోయింది అదే మగాడయ్యుంటే ఈ పాటికే వ్యవహారం వేరేగా ఉండేదం’టూ బెదిరించటం ఏమిటో అర్ధం కావటం లేదు. అసలు అయ్యన్నపాత్రుడి తాత లత్సాపాత్రుడి ఫొటో కౌన్సిల్ సమావేశం హాలులో ఎందుకు పెట్టాలో  ఎవరికీ అర్ధం కావటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: