ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ముగ్గురు వ్యక్తుల వివాదాస్పద సమావేశంపై ఏ సంబంధం లేని తెలుగుదేశంపార్టీ ఎందుకు సంబంధించింది ? ఇపుడిదే ప్రశ్నకు సమాధానం చెప్పుకోలేక టిడిపి నానా అవస్తలు పడుతోంది. ఈనెల 13వ తేదీన హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లోని 8వ అంతస్తులోని ఓ గదిలో  బిజెపి రాజ్యసభ ఎంపి సుజనా చౌదరి, బిజెపి నేత మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, రాష్ట్ర ఎన్నికల మాజీ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రహస్యంగా భేటి అయ్యారు.  వాళ్ళ భేటి అయిన పది రోజుల తర్వాత వాళ్ళు ఒకళ్ళ తర్వాత మరకొళ్ళు హోటల్లోకి అడుగుపెట్టడం,  8వ అంతస్తులోని  ఒకే గదిలోకి వెళ్ళిన సిసి టివి ఫుటేజి దృశ్యాలు 23వ తేదీ మధ్యాహ్నం బయటపడ్డాయి. దాంతో ఒక్కసారిగా సంచలనం మొదలైంది.

 

సిసిటివి ఫుటేజి దృశ్యాలు ఎప్పుడైతే బయటపడ్డాయో వెంటనే వైసిపి స్పందించింది. మంత్రులు, ఎంఎల్ఏలు ఇటు నిమ్మగడ్డతో పాటు అటు సుజనాపైన కూడా తీవ్రమైన ఆరోపణలతో విరుచుకుపడ్డారు. దాంతో రాజకీయదుమారం మొదలైంది. అయితే ఫుటేజి బయటపడిన కొద్దిసేపటికే తెలుగుదేశంపార్టీ అధికారికంగా స్పందించింది. టిడిపి అధికార ప్రతినిధి వర్లరామయ్య మీడియాలో మాట్లాడుతూ భేటి ఉద్దేశ్యాలను వివరించాడు. వాళ్ళ భేటిని సమర్ధిస్తు మాట్లాడాడు. అంతా బాగానే ఉందికానీ బిజెపి నేతలు+నిమ్మగడ్డ సమావేశంపై వైసిపి నేతలు ఆరోపణలు చేస్తే టిడిపి ఎందుకు స్పందించింది ? అన్నదే అర్ధం కావటం లేదు.

 

వైసిపి ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత సుజనా చౌదరి, కామినేనిపై ఉంటుంది. అలాగే నిమ్మగడ్డ కూడా సమాధానం చెప్పాలి. వాళ్ళెవ్వరు స్పందించకుండానే  భేటిని సమర్ధిస్తు మాట్లాడాల్సిన అవసరం వర్లకు ఏమొచ్చింది ?  పైగా వర్ల మీడియా సమావేశంలో చెప్పిన విషయాలకు, తర్వాత భేటిపై  సుజనా  చెప్పిన కారణాలకు అసలు పొంతనే కనబడలేదు. భేటిపై ఇద్దరు పరస్పర విరుద్ధమైన కారణాలు వినిపించారు. వర్ల చెప్పిన కారణాలు ఎలాగున్నాయంటే ’తాడిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డికోసం’ అన్న సామెతలాగుంది.

 

రాష్ట్రప్రభుత్వ తీరుపై చర్చించేందుకు నిమ్మగడ్డ సుజనాతో భేటి అయినట్లు వర్ల చెప్పటమే విడ్డూరంగా ఉంది. రాష్ట్రప్రభుత్వ తీరుపై సుజనాతో నిమ్మగడ్డ చెప్పుకునేదేముంటుంది ? ఒకవేళ విన్నా సుజనా చేయగలిగేదేముంటుంది ?  నిమ్మగడ్డ వ్యవహారం ఎలాగూ సుప్రింకోర్టు విచారణలో ఉంది కాబట్టి ఆ విషయంలో ఎవరు చేయగలిగేది కూడా ఏమీ లేదు. ఇక మిగిలిన విషయాలతో నిమ్మగడ్డకు సంబంధమే లేదు. మరిక వీళ్ళ ముగ్గురు కలిసి చర్చించేదేముంటుంది ?

 

అయితే ఇక్కడే ఓ ఇంట్రస్టింగ్ ట్విస్టు ఒకటుంది. అదేమిటంటే ముగ్గురు కలిసి గదిలో నుండి తమ బాస్ తో మాట్లాడినట్లు వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి ట్విట్టర్లో ఆరోపించాడు. ఫేస్ టైంలో ముగ్గురితో మాట్లాడిన నాలుగో బిగ్ బాస్ ఎవరు ? అసలు విజయసాయి వేసిన ప్రశ్న ఆసక్తిని రేపుతోంది. మరి ఆ బాస్ ఎవరు ?  దాదాపు గంటన్నరపాటు వీళ్ళ ముగ్గురు ఏమి మాట్లాడుకున్నారు ?  బిగ్ బాస్ తో ఏమి మాట్లాడారు ? అనేది సస్పెన్సును పెంచేస్తోంది. మరి దీనికి సమాధానాలు ఎప్పుడు వస్తాయో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: