అధికారపార్టీ నరసాపురం ఎంపి కనుమూరు రఘురామ కృష్ణంరాజుకు భవిష్యత్తు అర్ధమైపోయినట్లే ఉంది.  పార్టీలైన్ కు వ్యతిరేకంగా మాట్లాడటమే కాకుండా ’నా ముందు ఆఫ్ట్రాల్ జగన్మోహన్ రెడ్డి ఎంత’ ? అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడాడు. పార్టీకి, జగన్ కు ఎదురు తిరిగి మాట్లాడితే తనంటే భయపడిపోతారని అనుకున్నట్లున్నాడు. అయితే జగన్ తనను ఈ స్ధాయిలో దెబ్బ కొడతాడని ఎంపి ఊహించి ఉండడు. అందుకనే  జగన్  దెబ్బ నుండి తప్పించుకోవటానికి అర్జంటుగా  హై కోర్టును ఆశ్రయించాడు. పార్టీ అధినేత చేతకాని వాడైతేనో లేకపోతే బ్లాక్ మెయిలింగ్ కు భయపడిపోయే వాడైతేనో ఎంపి ఆటలు సాగేవే. కానీ ఇక్కడున్నది జగన్ అన్న విషయం మరచిపోయినట్లున్నాడు. అందుకనే తనకు షోకాజ్ నోటీసు ఇవ్వగానే  ఏదో విధంగా మాట్లాడి సర్దుబాటు చేసుకోకుండా ఓవర్ యాక్షన్ చేశాడు.

 

మామూలుగా అయితే పార్టీ తరపున షోకాజ్ నోటీసు అందగానే వెంటనే పార్టీ నేతలతో మాట్లాడుకుని సర్దుబాటు చేసుకుంటారు. అయితే కృష్ణంరాజు మాత్రం తనకు సోటిసిచ్చే అధికారమే పార్టీకి లేదుపొమన్నాడు. అసలు తాను వైఎస్సార్ కాంగ్రెస్ తరపున గెలవలేదని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచానంటూ ఎగస్ట్రాలు పోయాడు. పార్టీ ఉనికినే దెబ్బ కొడదామని చూశాడు. విచిత్రమేమిటంటే మొన్నటి ఎన్నికల ప్రచారంలో  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటి చేస్తున్నట్లు  తానే సొంతంగా ప్రకటనలు ఇచ్చుకోవటం. ఇంత చేసిన వాడు ఇపుడు అదే పార్టీ ఉనికిపైనే ఎన్నికల కమీషన్ ముందు ఫిర్యాదు చేశాడు.  కేంద్రమంత్రులతో పాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా కలిశాడు. సరే ఎవరిని కలిసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు జగన్ మాటే చెల్లుబాటవుతుందన్న విషయం మరచిపోయాడు పాపం.

 

తనను ఎవరు ఏమీ చేయలేరంటూ ప్రగల్బాలు పలికాడు. తనను తాను సూర్యుడితో పోల్చుకున్నాడు. అబ్బో చాలా మాటలే మాట్లాడాడు కృష్ణంరాజు. తీరా చూస్తే ఏమైంది అర్జంటుగా తనను పార్టీలో నుండి  సస్పెండ్ చేయకుండా, తనపై అనర్హత వేటు పడకుండా కాపాడమంటూ హై కోర్టులో పిటీషన్ వేయటమే విచిత్రంగా ఉంది. తనను ఎవరు ఏమీ చేయలేరని బీరాలు పలికిన ఎంపి ఇంత అర్జంటుగా హై కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఎందుకంటే తనపై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తే అనర్హత వేటు పడటం ఖాయమని ఎంపికి అర్ధమైపోయిందా ?  మహా అయితే ఓ నెల రోజులు ఇష్యుని లాగ గలడే కానీ ఎక్కువ రోజులు అనర్హత వేటు నుండి తప్పించుకునే అవకాశం లేదని తేలిపోయినట్లుంది.

 

అందుకనే స్పీకర్ నిర్ణయం కోసం ఎదురు చూడకుండా ముందు జాగ్రత్తగా కోర్టును ఆశ్రయించాడు. ఒకవేళ స్పీకర్ గనుక కృష్ణంరాజుపై అనర్హత వేటు వేస్తే అప్పుడు కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే. ఎందుకంటే ఎంపిపై అనర్హత వేటు వేయటమన్నది పూర్తిగా స్పీకర్ విచక్షణపై ఆధారపడిన విషయమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎంపిపై వేటు వేయాలని స్పీకర్ డిసైడ్ అయితే కోర్టు కూడా అడ్డుకునేందుకు లేదు. ఎందుకంటే శాసనవ్యవస్ధ అధికారాల్లోకి న్యాయ వ్యవస్ధ జోక్యం చేసుకునే అవకాశాలు తక్కువే. కాబట్టి ఎంపి కోర్టును ఆశ్రయించినా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. మొత్తానికి జగన్ దెబ్బంటే ఎలాగుంటుందో కృష్ణంరాజుకు తొందరలోనే అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: