తెలుగుదేశంపార్టీలో చినబాబు అలియాస్ నారా లోకేష్ రాజకీయంగా ఎదగటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు లేదు. ఎంతసేపు ట్విట్టర్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఏదో ఓ కూత కూయటమే కానీ క్షేత్రస్ధాయిలోకి దిగి నేతలు, శ్రేణులను ఉత్సహపరచటం గురించి ఆలోచిస్తున్నట్లు కనబడటం లేదు. జగన్ సిఎం అయిన దగ్గర నుండి రాష్ట్రంలో అరాచకం ఏలుతోంది, డిక్టేటర్ పరిపాలన సాగుతోంది అని ట్విట్టర్లో పోస్టులు పెడితే ఏమొస్తుందో లోకేష్ కే తెలియాలి. నిజంగానే జగన్ పాలన అంత అధ్వాన్నంగా ఉంటే, అన్ని అరాచకాలు జరుగుతుంటే మరి జనాలు ఎందుకు ఊరుకున్నట్లు ?

 

ఎప్పుడు కూడా సమాజంలో పార్టీల వారీగా ఓటుబ్యాంకు ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. కారణాలు ఏవైనా కానీండి ఒక్కోక్కళ్ళకు ఒక్కో నేత నచ్చుతాడు. అలాగే కొందరికి చంద్రబాబునాయుడు, మరికొందరికి జగన్మోహన్ రెడ్డి నచ్చుతాడనటంలో సందేహం లేదు. కాబట్టి ఓటర్లలో కొందరు టిడిపికి మద్దతుగాను మరికొందరు వైసిపి మద్దతుగాను ఉంటారు. పార్టీల వారీగా ఓటర్లు చీలిపోయినట్లే న్యూట్రల్స్ గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. నిజానికి వీళ్ళ సంఖ్యే చాలా ఎక్కువ. ఎన్నికల సమయంలో వీళ్ళలో ఏ పార్టీవైపు ఎక్కువగా మొగ్గు చూపుతారో ఆ పార్టీనే గెలుస్తుంది.

 

ఇపుడు లోకేష్ ఆరోపణలనే తీసుకుంటే జగన్ పాలన అరాచకంగా తయారైందని చేస్తున్న ఆరోపణలకు న్యూట్రల్ జనాల్లో ఎటువంటి మద్దతు కనబడటం లేదు. ఏడాది పాలనలో  జగన్ సుమారు 3.9 కోట్లమంది లబ్దిదారులను  తన సంక్షేమ పథకాల ద్వారా టచ్ చేశాడు. ఇందులో పార్టీపరంగా చీలిపోయిన జనాలతో పాటు న్యూట్రల్స్ కూడా చాలామందే ఉన్నారు. అంటే వీళ్ళల్లో ఎవరికి కూడా లోకేష్ ఆరోపిస్తున్నట్లుగా జగన్ పాలన అరాచకంగా సాగుతున్నట్లు కనబడం లేదనే అనుకోవాలి. కాబట్టే న్యూట్రల్స్ మద్దతు లోకేష్ కు దొరకటం లేదు.

 

కాబట్టి లోకేష్ అయినా టిడిపి నేతలైనా చేయాల్సిందేమంటే ఆరోపణలు చేసేటపుడు ఆధారాలతో సహా చూపించాలి. ఉదాహరణకు తాజాగా ప్రవేశపెట్టిన 108, 104 అంబులెన్సుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు చంద్రబాబు, లోకేష్ అండ్ కో ఆరోపణలు చేస్తోంది. అందుకు ఆధారాలు ఏమిటంటే అంబులెన్సుకు పెంచిన నిర్వహణ వ్యయమట. చంద్రబాబు హయాంలో వందలాది అంబులెన్సులను మూలన పడేసిన విషయం అందరికీ తెలిసిందే. అవసరమై ఎవరు ఫోన్ చేసినా ఏదో కారణం చెప్పేవాళ్ళే కానీ వెళ్ళి బాధితులను ఆదుకునే ప్రయత్నం చేసింది లేదు.

 

అయితే జగన్ తాజాగా జెండా ఊపి ప్రారంభించిన అంబులెన్సుల్లో ఏర్పాటు చేసిన అధునాతన సౌకర్యాలు, వైద్య పరికరాలు, లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ తదితరాల వల్ల నిర్వహణ వ్యయం పెరిగితే పెరిగుండవచ్చు. ఇంతోటిదానికి బారీ ఎత్తున కుంభకోణం జరిగిపోనియట్లు నానా గోల చేశారు. వీళ్ళింత గోల చేసినా జనాలు ఏమాత్రం పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా లోకేష్ కాస్త ఇంగితం ఉపయోగించి ట్విట్టర్ లో నుండి బయటకు వచ్చి రాజకీయాలతో సంబంధం లేని  మామూలు జనాలతో  మాట్లాడితే ప్రభుత్వ పనితీరు మీద సరైన ఫీడ్ బ్యాక్ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: