తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో పోల్చుకుంటే మాజీమంత్రి అచ్చెన్నాయుడు చాలా నయమనే చెప్పాలి. రూ. 157 కోట్ల ఇఎస్ఐ స్కాంలో అరెస్టయిన అచ్చెన్న తనకు కుంభకోణంతో సంబంధం లేదని మాత్రమే చెబుతున్నాడు. తాను నిర్దోషినని నిరూపించుకునేందుకు కోర్టులో పోరాటం చేస్తున్నాడు. బెయిల్ కోసం శతవిధాల ప్రయత్నాలు చేసుకుంటున్నాడు. సరే ఇదంతా లీగల్ వ్యవహారాలు కాబట్టి ముందు బెయిల్ రావటానికి తర్వాత కేసు విషయం తేలేటప్పటికి ఎంత కాలం పడుతుందో ఎవరు చెప్పలేరు. మొత్తానికి అవినీతి కేసులో నుండి బయటపడటానికి అచ్చెన్న న్యాయపోరాటం చేయటం ఆహ్వానించదగ్గ పరిణామమనే చెప్పాలి.

 

ఇదే చంద్రబాబు అయ్యుంటే ఏమి చేసుండేవాడు ?  ఇటువంటి ఆరోపణలు వచ్చినపుడు గతంలో ఏమి చేశాడు అన్న విషయాలను గమనిస్తే బాగుంటుంది.  చంద్రబాబుపై   అవినీతి ఆరోపణలు చేస్తు గతంలో కొందరు  కోర్టులో కేసులు వేశారు. అయితే వాళ్ళ ఆరోపణలు తప్పని చెప్పకుండా తనపై విచారణకోరే అర్హతే సదరు ఫిర్యాదుదారుకి లేదంటూ వాదించాడు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు తప్పని కాకుండా పిటీషన్ వేసిన వ్యక్తి అర్హత గురించి మాత్రమే మాట్లాడే ఘనుడు చంద్రబాబు. తనపై వచ్చిన చాలా కేసుల్లో  ఈ విధంగానే అడ్డదిడ్డంగా వాదించాడు.  అంతేకానీ ఒక్క కేసులో కూడా తాను నిర్దోషిగా నిరూపించుకోలేదు.

 

ఎప్పటి కేసులో ఎందుకనుకుంటే ఇప్పటి వాళ్ళకందరికీ బాగా తెలిసిన, దేశంలో సంచలనం సృష్టించిన  ’ఓటుకునోటు’ కేసు విషయమే తీసుకుందాం.  ఓటుకునోటు కేసులో చంద్రబాబే ప్రధాన సూత్రదారుడుగా వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కేసు వేశాడు. అయితే తనపై  ఏసిబి విచారణ జరపకూడదని స్టే తెచ్చుకున్నాడే కానీ ఆ కేసుతో తనకు సంబంధం లేదని ఎక్కడా చెప్పుకోలేదు. తనని విచారించే అర్హత ఏసిబికి లేదని వాదించాడే కానీ తాను నిర్దోషిగా నిరూపించుకునే ప్రయత్నం ఏరోజు చేయలేదు. ఓటుకునోటు కేసులో కీలక పాత్రధారి అప్పటి టిడిపి ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి అన్న విషయం ప్రపంచానికంతా తెలిసిందే.  

 

చంద్రబాబు చెబితేనే రేవంత్ తెలంగాణా నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ ఓటు కొనటానికి వెళ్ళాడని అందరికీ తెలుసు. కానీ దాన్ని సాంకేతికంగా నిరూపించాలంటే కోర్టులో విచారణ జరగాలి. స్టీఫెన్ తో చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన రికార్డును కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ లో నిరూపణ అయ్యిందని ఏసిబి ఉన్నతాధికారులు కోర్టులో  అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. అయినా విచారణ ఒక ఇంచుకూడా ముందుకు సాగటం లేదు. కోర్టులో విచారణ పూర్తికాకపోయినా తనకు తానే క్లీన్ చిట్ ఇచ్చేసుకున్నాడు చంద్రబాబు. సో జరుగుతున్న విషయాలను గమనిస్తే చివరకు మాజీమంత్రి కొల్లు రవీంద్ర కూడా చంద్రబాబుకన్నా నయమే అనిపిస్తుంది. హత్య కేసులో అరెస్టయిన కొల్లు కూడా  కేసుతో తనకు సంబంధం లేదని చెబుతున్నాడే కానీ తనపై ఆరోపణలు, విచారణ జరిపే అర్హత పోలీసులకు లేదని వాదించటం లేదు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: