తెలుగు చిత్ర‌సీమ‌కు పాదులు వేసిన ప్ర‌ముఖుల్లో కె.విరెడ్డి ఒక‌రు. త‌న అద్భుత ప్ర‌తిభ‌తో ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాల‌ను తెర‌కెక్కించారు. ముఖ్యంగా జాన‌ప‌ద‌, పౌరాణిక చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించి తెలుగు ప్రేక్ష‌కుల‌ను మంత్ర‌ముగ్ధుల‌ను చేశార‌నే చెప్పాలి. కె.వి.రెడ్డి పేరు చెప్పగానే మొదట గుర్తుకు వచ్చే చిత్రం ‘మాయాబజార్’. అతని విజయవంతమైన సినిమాల్లో మాయాబజార్ (1957) వంటి పౌరాణిక నేపథ్యం ఉన్న చిత్రం, శ్రీకృష్ణార్జున యుద్ధము (1963), శ్రీకృష్ణసత్య (1972) వంటి పౌరాణిక చిత్రాలు, గుణసుందరి కథ (1949), పాతాళ భైరవి (1951), జగదేకవీరుని కథ (1961) వంటి జానపదాలు, పెద్దమనుషులు (1954), దొంగ రాముడు (1955) వంటి సాంఘిక చిత్రాలు, భక్త పోతన (1943), యోగివేమన (1947) వంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలు ఉన్నాయి.  ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌వి త‌క్కువే అయినా..అన్నిచ‌రిత్ర‌లో నిలిచిపోయేవే కావ‌డం గ‌మ‌నార్హం.

 


కె.వి.రెడ్డి పూర్తి పేరు కదిరి వెంకటరెడ్డి  1912 జూలై 1న అనంతపురం జిల్లాలోని తాడిపత్రి సమీపంలో తేళ్ళమిట్ట పల్లెలో వెంకటరంగమ్మ, కొండారెడ్డిల‌కు జన్మించాడు.  చిన్నతనంలోనే తండ్రి మరణించ‌డంతో తల్లితో పాటు తాడిపత్రిలోని అమ్మమ్మ గారి ఇంటికి వచ్చేసి మేన‌మామ వ‌ద్ద్దే పెరిగి పెద్ద‌య్యాడు. తర్వాతి కాలంలో తనను సినిమా రంగంలోకి తీసుకువచ్చి దర్శకుడిని చేసిన వ్యాపారవేత్త మూలా నారాయణస్వామితో తాడిపత్రిలోనే కలిసి చదువుకున్నాడు. మేనమామల ప్రోద్బలంతో, సహాయంతో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చేరిన కె.వి. అక్కడే మెట్రిక్, డిగ్రీ పూర్తిచేశాడు. ఉద్యోగ ప్రయత్నాలు విఫలమై, చిన్న వ్యాపారం చేస్తూండగా మూలా నారాయణస్వామి పిలవగా సినిమా నిర్మాణ శాఖలో కెరీర్ ప్రారంభించాడు.

 

వాహినీ పిక్చర్స్ సంస్థలో ప్రొడక్షన్ మేనేజరుగా ప్రారంభమై 1942లో భక్త పోతన సినిమాకు తొలిసారి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమా పెద్ద హిట్ కావ‌డంతో ఆయ‌నకు ఆఫ‌ర్లు వెల్లువెత్తాయి. కె.వి.రెడ్డి సినిమాలు భారీ విజయాలు సాధించి, నిర్మాణ సంస్థలకు విపరీతమైన లాభాలు, ఎంతో పేరు తెచ్చిపెట్టేవి. దీనితో 1950ల్లో మొదలై 60ల తొలినాళ్ళ వరకూ అతనితో సినిమాలు తీయడానికి పోటీపడే పరిస్థితి ఉండేది. 60వ దశకం మలి భాగంలో కె.వి.రెడ్డి తీసిన సత్య హరిశ్చంద్ర (1964), ఉమా చండీ గౌరీ శంకరుల కథ (1968), భాగ్యచక్రం (1968) సినిమాలు వరుసగా పరాజయం పాలు కావడంతో అతనితో సినిమా చేయడానికి ఎవరూ ముందుకురాని స్థితి ఏర్పడింది. 

 


ఈ స్థితిలో కె.వి.ని గురువుగా భావించే ఎన్.టి.రామారావు అతనిపై గౌరవాభిమానాల వల్ల తన స్వంత సంస్థ అయిన ఎన్.ఏ.టి. ద్వారా శ్రీకృష్ణసత్య (1971) సినిమా తీయించాడు. పరాజయాల వల్ల సినిమా తీసే అవకాశం లేని దుస్థితిలో కెరీర్ ముగించాల్సి వస్తుందన్న భయాందోళనల నుంచి విడిపిస్తూ ఆ సినిమా మంచి విజయం సాధించింది. మంచి సినిమా తీసిన సంతృప్తితో 1972లో కె.వి.రెడ్డి మరణించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: