ఆయ‌న అక్ష‌రం నిప్పు క‌ణిక‌.. ఆలోచన, అక్షరం, ఆచరణ ఏక రూపం దాల్చిన విప్లవ కవి, నవలా రచయిత, పాటల రచయిత. అతను ప్రపంచ పురోగతి సాంతం శ్రమజీవి నెత్తుటి బొట్టులోనే ఇమిడివుందని గాఢంగా నమ్మిన వ్యక్తి చెరబండరాజు. చెరబండరాజు (1944 - జూలై 2, 1982 ) కలం పేరుతో దిగంబరకవులలో ఒకనిగా సుపరిచితమైన "బద్ధం భాస్కరరెడ్డి‌ ఆలోచన, అక్షరం, ఆచరణ ఏక రూపం దాల్చిన విప్లవ కవి, నవలా రచయిత, పాటల రచయిత. చెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కరరెడ్డి. అతను హైదరాబాదు జిల్లా అంకుషాపూర్ లోని ఒక పేద రైతు కుటుంబంలో 1944లో పుట్టాడు. హైదరాబాదులో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. అతను ఆరుగురు దిగంబరకవులలో ఒకడు. "నన్నెక్కనివ్వండి బోను" అనే కవితతో కవితాలోకంలో సూర్యుడిలా ఉదయించాడు.

 

 దిగంబర కవిత్వంలో గొప్ప కవితగా చెరబండరాజు "వందేమాతరం" గేయం పలువురి ప్రశంసలు పొందింది. విరసం వ్యవస్థాపక కార్యవర్గ సభ్యుడు, కార్యదర్శిగా 1971-1972 లో పనిచేసాడు. దిగంబరకవి నుండి విప్లవకవిగా మారాక విప్లవ సాహిత్యానికి పాట అవసరాన్ని గుర్తించి విరివిగా పాటలు రాశాడు. 1975 ఏప్రిల్‌లో ప్రపంచ తెలుగు మహా సభలను బహిష్కరించిన సందర్భంలో మహాకవి శ్రీశ్రీతో పాటు అరెస్టు అయ్యాడు. 1971 నుండి 1977 మధ్యకాలములో మూడేళ్ల పాటు జైళ్లో గడపడం వలన ఈయన ఆరోగ్యము క్షీణించింది. జైళ్లో మొదలైన తీవ్ర తలనొప్పి మెదడు క్యాన్సర్ గా పరిణమించింది. 1977 నుండి 1981 మధ్యలో ఈయనకు మూడుసార్లు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఈయన అనారోగ్యముతో ఉండగానే ప్రభుత్వం ఉద్యోగం నుండి తొలగించింది. అయితే ప్రజాందోళన వల్ల తిరిగి చేర్చుకోవలసి వచ్చింది. అనారోగ్యానికి గురైన చెరబండరాజు మెదడు కాన్సర్‌తో 1982 జూలై 2న మరణించాడు.

 

“చెరబండరాజు కవితలూ పాటలూ” అన్న పుస్తకం 1982 లో వరవర్రావ్ సంపాదకత్వంలో వచ్చింది. పీపుల్స్ బుక్స్ వాళ్ళు వేశారు. దీంట్లో 23 కవితలు, 30 పాటలూ ఉన్నాయి. అతనికి  పాలకవర్గాల మీద ఉన్న‌ కోపం, కసి ఎక్కడా దాచుకోకుండా క‌వితాస్త్రాల‌ను ప్ర‌యోగించాడు.

ఆకలి, కామం, కలలూ, కన్నీళ్ళూ
మనిషిలోని మర్మజ్ఞానమంతా ఒక్కటే
దేశమేదైతేనేం ? మట్టంతా ఒక్కటే
అమ్మ ఎవరైతేనేం ? చనుబాల తీపంతా ఒక్కటే
బిక్కమొహాలతో చూస్తారేం ?
పిచ్చివాణ్ణిగా కేసు పుటప్ చేయండి
నన్నెక్కనివ్వండి బోను (నన్నెక్కనివ్వండి బోను) అన్నాడు

మీ రాత్రి చొక్కాలు పగలు నిలవవు
పగటి చొక్కాలు రాత్రి ఉండవు
మీ పెళ్ళాలు పిచ్చివాళ్ళు
పాతిక చీరతో స్వర్గాన్ని కప్పుకొని
వంటగదిలో ఆలోచనలకు ఎసర్లు పెడుతున్న వాళ్ళు
………
నీ గుండెలు నా గుండెలు
మూతబడిన కొండ గుహలు
ఎక్కనివ్వండి నన్ను బోను  అని గ‌ర్జించిన క‌వి.

 

చెరబండరాజు రచనలు
దిగంబర కవితా సంకలనాలు (1965,1966,1968)
దిక్చూచి (1970)
ముట్టడి ( 1972
గమ్యం (1973)
కాంతి యుద్ధం (1973)
గౌరమ్మ కలలు (1975)
జన్మహక్కు (1978)
పల్లవి (1980)
చెరబండరాజు కవితలు (1982)
కత్తి పాట (1983)
నవలలు
మాపల్లె (1978)
ప్రస్థానం (1981)
నిప్పులరాళ్లు (1983)
గంజినీళ్లు (1983)
కథలు
చిరంజీవి చెరబండరాజు కథలు (1985)

మరింత సమాచారం తెలుసుకోండి: