తెలుగు జాతిపై మిక్కిలి ప్ర‌భావాన్ని చూపారు యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి (జూలై 8, 1949 - సెప్టెంబర్ 2, 2009). ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రిగా ప‌నిచేసిన ఆయ‌న కాంగ్రెస్ పార్టీ త‌రుపున  1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంనుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం నుంచి 1978లో మొద‌లైన ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానంలో ఓట‌మి ఎరుగ‌లేదు. 1978లో మొద‌టి సారిగా శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా, 4 సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టారు.


ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు. జనతాపార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని కూడా విజయం సాధించిన తొలి ఎన్నికల (1978) వెంటనే మంత్రిపదవిని అలంక‌రించ‌డం గ‌మ‌నార్హం. ఆ తరువాత వెనువెంటనే ముగ్గురు ముఖ్యమంత్రులు మారిననూ ఆ మూడు మంత్రిమండళ్లలో స్థానం సంపాదించాడు. ఆ తరువాత చాలా కాలం పాటు ఎటువంటి ప్రభుత్వ పదవీ దక్కలేదు. 1989-94 మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించినా అవకాశం రాలేదు. 1999లో మళ్ళీ శాసనసభకు ఎన్నికై ప్రతిపక్షనేతగా ఉంటూ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు వ్యూహం రచించాడు. 2003లో మండువేసవిలో 1460 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ప్రచారం అతని విజయానికి బాటలు పరచింది.


2004 ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం నుంచి 40వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందడంతో ముఖ్యమంత్రి పీఠం వై.ఎస్.రాజశేఖరరెడ్డికే దక్కింది. 2004 మేలో జరిగిన 12వ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికస్థానాలు సాధించడంతో అదివరకే పార్టీలో పేరు సంపాదించిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాడు. పాదయాత్ర వలన జనాదరణ పొందడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పెండింగులో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేయటం, జలయజ్ఞంలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పిదప తొలి సంతకం ఉచిత విద్యుత్తు ఫైలు పైనే చేశాడు. 2009 ఏప్రిల్లో జరిగిన 13వ శాసనసభ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలలో విజయం సాధించడానికి కృషిచేసి వరుసగా రెండో పర్యాయం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాడు. 

 

 వై.యస్.రాజశేఖర్ రెడ్డి 1949 జూలై 8 న వైఎస్ఆర్ జిల్లా, జమ్మలమడుగులోని సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు జయమ్మ, రాజారెడ్డి. ఆయన తండ్రి బళ్ళారిలో కాంట్రాక్టరుగా పనిచేస్తుండటం వల్ల ఆయన పాఠశాల చదువంతా బళ్ళారిలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో సాగింది. ఆ తర్వాత విజయవాడ లయోలా కళాశాలలో చేరాడు. 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్యవిద్యలో పట్టా పుచ్చుకున్నాడు. గుల్బర్గాలోని మహాదేవప్ప రాంపూరే వైద్య కళాశాలలో వైద్యవృత్తిని అభ్యసిస్తుండగానే కళాశాల విద్యార్థిసంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. శ్రీ వెంకటేశ్వర వైద్యకళాశాల (యెస్.వి.ఆర్.ఆర్), తిరుపతి నుంచి హౌస్‌సర్జన్ పట్టా పొందాడు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు ఆకర్షితుడైన రాజశేఖరరెడ్డి యెస్.వి.ఆర్.ఆర్ కళాశాలలో పనిచేస్తుండగానే అక్కడ హౌస్‌సర్జన్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

 

ఆయన సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తూ నల్లమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: