తెర‌పై మంచి న‌ట‌న క‌న‌బ‌ర‌చినా ఎందుక‌నో కొంత‌మందికి రావాల్సి గుర్తింపు రాదు.. గుర్తింపు వ‌చ్చే క్ర‌మంలో  చేసే కొన్ని పొర‌బాట్లు కూడా అందుకు తోడ‌వుతుంటాయి. అంతిమంగా ప్ర‌తిభ ఉన్నా..ప్రేక్ష‌కుల మ‌దిలో క్రేజీ యాక్ట‌ర్‌గా, సినిమా హీరో కాలేక‌పోతుంటారు. ఆ కోవ‌కే చెందిన న‌టుడు  సూరపనేని శ్రీధర్. నిజానికి మంచి గ్లామ‌ర్‌, అగ్ర హీరోల‌కు ధీటుగా న‌ట‌న ప్ర‌తిభ ఉన్నా..ఆయ‌న కెరీర్ గొప్ప‌గా సాగ‌లేదు. కొన్ని హిట్లు ప‌డ్డా..స్టార్ డ‌మ్ రాలేదు. సూరపనేని శ్రీధర్ (డిసెంబర్ 21, 1939 - జూలై 11, 2007) తెలుగు సినిమా ప్ర‌స్తానం మూడు దశకాల పాటు సాగింది. తెలుగులో దాదాపు  150 సినిమాలలో నటించారాయ‌న‌. ఆయ‌న న‌టించిన సినిమాల్లో ముత్యాల ముగ్గు, అమెరికా అమ్మాయి సినిమాలు బాగా గుర్తింపు తెచ్చాయి.

 


కృష్ణా జిల్లా, ఉయ్యూరు సమీపంలోని కుమ్మమూరు గ్రామంలో 1939 డిసెంబర్ 21 న ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో శ్రీధర్ జ‌న్మించారు.  మచిలీపట్నంలో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకొని 1964లో హైదరాబాదుకు వచ్చి ప్రభుత్వపనుల శాఖలో గుమాస్తాగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించాడు. ఉద్యోగం చేస్తూనే సాయంత్రం కళాశాలకు వెళుతూ బి.ఏ పూర్తిచేశారు.  కళాశాల సాంస్కృతిక విభాగంలో క్రియాశీలకంగా పనిచేస్తూ కార్యదర్శి అయ్యాడు. నాట‌కాల‌పై ఆస‌క్తి ఉండ‌టంతో ఆయ‌న‌ పరీక్ష, చీకటి తెరలు, అభాగ్యులు, సాలెగూడు, మండేకొండలు మొదలైన అనేక నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించి ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందారు. 

 

ఆ తర్వాత తల్లా? పెళ్లామా? చిత్రంతో తెలుగు జాతి మనది అనే పాటలో విద్యార్థిగా సినీ రంగ ప్రవేశం చేశాడు. మొద‌ట చిన్న పాత్ర‌ల్లో న‌టించిన ఆయ‌న త‌ర్వాతి కాలంలో హీరోగా అవ‌కాశం ల‌భించింది. అయితే స‌హాయ న‌టుడిగానే ఆయ‌న‌కు ఎక్కువ గుర్తింపు ద‌క్కింది. ముఖ్యంగా కృష్ణ సినిమాల్లో శ్రీధ‌ర్ త‌ప్ప‌నిసరిగా ఉండేవాడు. కృష్ణ‌కు శ్రీధ‌ర్ ఒక సెంటిమెంట్‌గా ఇండ‌స్ట్రీలో టాక్ ఉండేది. అందుకే కృష్ణ నటించిన సినిమాలన్నింటిలోనూ శ్రీధర్ కనిపించేవాడు. జస్టిస్ ఛౌదరి సినిమాలో ఎన్టీఆర్ కొడుకుగా శ్రీధ‌ర్  న‌టించారు. అయితే నటుడిగా ఉండగానే ఆయ‌న  రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టారు. తన చివరి దశకంలో ఆ వ్యాపార రంగంలో బిజీగా ఉన్నాడు. అమెరికాఅమ్మాయి, అడవి రాముడు, జస్టిస్‌ చౌదరి, కరుణామయుడు, ఈనాడు, బొమ్మరిల్లు, సీతా మహాలక్ష్మీ, యశోధకృష్ణ వంటి చిత్రాలు ఆయ‌న న‌ట‌న ప్ర‌తిభాకు నిద‌ర్శ‌నం.ఆయన న‌టించిన చివ‌రి చిత్రం రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన గోవిందా గోవిందా.. శ్రీధ‌ర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతూ, హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా గుండెపోటుతో జూలై 11, 2007 న మరణించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: