నిరంకుశ నిజాం పాల‌న‌కు వ్య‌తిరేకంగా వ‌రంగ‌ల్ కేంద్రంగా ప‌త్రిక‌ను న‌డిపిన సాహ‌సి ఎం ఎస్ ఆచార్య‌. ఓరుగ‌ల్లు నుంచి అక్ష‌ర ఉద్య‌మం చేసిన గొప్ప మ‌హానుభావుడు. 1958లో జనధర్మ వారపత్రికను స్థాపించాడు. 1971లో స్వంత ముద్రణాలయం బాలాజీ ప్రెస్‌ను నెలకొల్పాడు. 1988లో వరంగల్ వాణి అనే దినపత్రికను ప్రారంభించాడు. జనధర్మను 36 సంవత్సరాల పాటు, వరంగల్ వాణిని 13 సంవత్సరాల పాటు అనేక వ్యయప్రయాసలకోర్చి నడిపాడు. ఆయ‌న వేసిన పాదులే అక్క‌డ ప్ర‌శ్నించే త‌త్వాన్ని నేర్పారు..నిల‌దీసే ధైర్యాన్ని నెల‌కొల్పింది. ఆయ‌న జ‌ర్న‌లిజానికి చేసిన సేవ‌లు అజ‌రామ‌రం. ఆయ‌న స్ఫూర్తితో ఓరుగల్లులోనే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ఆ కాలంలో జ‌ర్న‌లిజం వృత్తితోకి వ‌చ్చారు. జ‌ర్న‌లిజం అనేది ఉద్యోగ‌మో, వృత్తో, వ్యాపాక‌మో కాద‌ని..అది ప్ర‌జ‌ల కోసం చేసే ఉద్య‌మ‌మ‌ని, ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే బాధ్య‌త‌ని అనే త‌రుచూ త‌న స‌హాచ‌రుల‌కు, సిబ్బందికి సూచించేవార‌ట‌.  అధికారంలో ఉన్న పార్టీలకు, ప్ర‌భుత్వాల‌కు ప‌త్రిక‌లు ఎప్ప‌టిక‌ప్పుడు బాధ్య‌త‌ను గుర్తు చేస్తూ ఉండాల‌ని చెప్పేవారు. జ‌ర్న‌లిజంలోని విలువ‌ల‌కు నిద‌ర్శ‌నంగా నిలిచారు. చెప్పింది ఆచ‌రించి చూపించడం ఆచార్య‌కే చెల్లింది.

 


ఆచార్య  1924, అక్టోబర్ 3వ తేదీన అమ్మమ్మ గారి గ్రామం సూర్యాపేటలో జన్మించాడు. తండ్రి ప్రసన్న రాఘవాచార్య ఉభయ వేదాంత పండితుడు. అతడు నెల్లికుదురు అనే గ్రామంలో వైద్యం చేసేవాడు. నెల్లికుదురులోని మదరసతహానియాలో నాలుగో తరగతి వరకు ఆచార్య ఉర్దూమీడియంలో చదువుకున్నాడు.   తన తండ్రి వద్దనే బాలరామాయణం, ధాతుమంజరి, రఘువంశం, కుమారసంభవం మొదలైనవి నేర్చుకున్నాడు.1942లో ఓసారి ఓ దుకాణం ముందు ఒక వ్యక్తి, మరో వ్యక్తిని చితకబాదడాన్ని చూసి చలించిపోయిన ఆచార్య ఆ సంఘటనను వార్తగా రాసి సికింద్రాబాద్ నుంచి వెలువడుతున్న తెలంగాణ పత్రికకు పంపాడు. తర్వాత 1947 జనవరి 1న ఆంధ్రపత్రిక ఏజెన్సీ తీసుకున్నాడు.

 


 1948లో అదే పత్రికకు విలేకరిగా చేరి 32ఏళ్లపాటు పనిచేశాడు. తెలుగు మాట్లాడితే నేరంగా పరిణించే నిజాం పాలనలో తెలుగు పత్రికకు వార్తలు రాసే విలేకరిగా పనిచేసాడు. అప్పుడు ఆంధ్రపత్రికే ఉద్యమానికి ఊపిరి. ఉద్యమ వార్తలున్న ఆ పత్రికను రహస్యంగా పంచిపెట్టేవాడు. అదే ఆయన ఉద్యమం ఉద్యోగం కూడా. రజాకార్ల దౌర్జన్యాలకు భయపడి వరంగల్లు వదిలి వందలాది కుటుంబాలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతే జనం లేని వీధుల్లో కందిలీ ఒక చేత లాఠీ మరొక చేత పట్టుకుని ప్రతాపరుద్ర దళం కార్యకర్తగా కాపలా కాసిన సాహసి. వావిలాల గోపాలకృష్ణయ్య తెనాలిలో స్వాతంత్ర్యానికి పూర్వం నిర్వహించిన జర్నలిజం శిక్షణాశిబిరంలో పాల్గొని పాత్రికేయ వృత్తి మెలకువలు నేర్చుకున్నాడు. పి.వి. నరసింహారావు, పాములపర్తి సదాశివరావు తదితరులు ప్రారంభించిన కాకతీయ పత్రికతో పాటు చిత్రవిచిత్ర మాసపత్రిక, ప్రగతి పత్రికలకు కూడా ఇతడు వార్తలు వ్రాసేవాడు. 1958లో జనధర్మ వారపత్రికను స్థాపించాడు. 

 


1971లో స్వంత ముద్రణాలయం బాలాజీ ప్రెస్‌ను నెలకొల్పాడు. 1988లో వరంగల్ వాణి అనే దినపత్రికను ప్రారంభించాడు. జనధర్మను 36 సంవత్సరాల పాటు, వరంగల్ వాణిని 13 సంవత్సరాల పాటు అనేక వ్యయప్రయాసలకోర్చి నడిపాడు. తెలంగాణ సాహిత్యానికి, సాంస్కతిక వారసత్వానికి సముచిత గౌరవ ప్రాభవాలను కల్పించడానికి ఈ పత్రికల ద్వారా వేదికను ఏర్పరచాడు. సామాజిక సమస్యలను చర్చించడానికి పరిశోధనాత్మక వార్తాంశాలను వెలుగులోకి రావ‌డానికి ఈ పత్రికలు ఎంతో ఉపయోగప‌డ్డాయి. వ్యవస్థాగత సమస్యల వల్ల 1993లో వరంగల్‌వాణి దినపత్రికను అమ్మేశాడు.పత్రికా నిర్వహణలో స్ఫూర్తిప్రదాతగా చరిత్రలో నిలిచిపోయిన ఎం.ఎస్.ఆచార్య తన 71వ యేట జులై 12, 1994న మరణించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: