డెక్కన్‌ డెవలప్మెంట్‌ సొసైటీ (డీడీఎస్‌) అంటేనే, జహీరాబాద్‌ ఎర్రమట్టినేలలు, అక్కడ పండించే కరవు పంటలు గుర్తుకు వస్తాయి.

 అంతరించి పోతున్న చిరు ధాన్యాల సాగును సేంద్రియ విధానంలో ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ సంస్ధ పనిచేస్తోంది. గత రెండు దశాబ్దాలుగా డీడీఎస్‌ ఆధ్వర్యంలో పాతపంటల జాతరను నిర్వహిస్తు... సేంద్రియ పంటలే, లక్ష్యంగా ఐదువేల మంది మహిళా రైతులు చిరు ధాన్యాలను పండిస్తున్నారు.


 ” జహీరాబాద్‌ సమీపంలోని రంజోల్‌లో 1999లో ఈ జాతరను మొదలు పెట్టాం, అప్పటి నుండీ ఏటా సంక్రాంతి పండుగ రోజుల్లో జాతరను నిర్వహిస్తూ, ఇప్పటి వరకు వంద గ్రామాల్లో ఉత్సవాలు నిర్వహించాం. మహిళా సంఘాలను ఏర్పాటు చేసి రైతమ్మలను చిరు ధాన్యాల సాగువైపు ప్రోత్సహిస్తున్నాం. ఎకరం, రెండెకరాల వ్యవసాయ భూమి ఉన్న రైతులు చిరు ధాన్యాలను సాగు చేస్తున్నారు. ఏడాదిపాటు వారి అవసరాలకు సరిపడా ధాన్యం నిల్వచేసుకుని, మిగతా ‘చిరు’ధాన్యాన్ని డీడీఎస్‌ సంస్థకు విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఉన్న ధర కంటే 20 శాతం ఎక్కువ ధర చెల్లించి, రైతులనుంచి పంటలను కొనుగోలు చేస్తున్నాం..” అని డీడీఎస్‌ డైరెక్టర్‌ పి.వి.సతీశ్‌ అన్నారు. 

 చిరుధాన్యాలను సంస్థ తరఫున హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా, మొబైల్‌ వాహనాల ద్వారా సైతం అమ్ముతున్నారు. సేంద్రియ పంటలే, లక్ష్యంగా ఐదువేల మంది మహిళా రైతులు చిరు ధాన్యాలను పండిస్తున్నారు. ” ఈ చిరు ధాన్యాల పంటలకు అంతగా తెగుళ్లు సోకవని, పెట్టుబడులు పెద్దగా అవసరం ఉండవని, వర్షాభావాన్ని సైతం తట్టుకుని పండుతాయని, చిరు ధాన్యాలను మిశ్రమ పంటలుగా, ఒక్కో రైతు 10 నుంచి 30 రకాల పంటలను కలిపి సాగుచేస్తున్నారు.” అని ఝరాసంగం గ్రామ మహిళలు అంటున్నారు.

 విత్తన బ్యాంకులు ప్రభుత్వం సరఫరా చేసే విత్తనాల కోసం ఎదురు చూడకుండా తమకు అవసరమైన విత్తనాలను నిల్వ చేసుకుంటున్నారు. జహీరాబాద్‌, కోహీర్‌, ఝరాసంగం, రాయికోడ్‌, న్యాల్కల్‌ మండలాల్లోని 68 గ్రామాల్లో విత్తన బ్యాంకులు ఏర్పాటు చేసుకున్నారు. ఖరీప్‌లో మినుము, పెసర, కంది, సజ్జ, పచ్చజొన్న, రబీలో శనగ, తెల్ల కుసుమ, సాయిజొన్న, అవిశ, వాము పంటలను పండిస్తున్నారు. కొర్రలు,తైదలు,రాగులు కూడా సాగు చేస్తున్నారు. 

 ” మా ప్రాంతంలో అపరాలు కొత్తగా పండిస్తున్నవి కాదు. మా పూర్వీకుల నుండి వారసత్వంగా సాగు చేస్తున్నాం. అపరాల పంట సాగు వల్ల ఆకు రాలి నేల సారవంతమవుతుందని, తక్కువ నీరుతో ఎక్కువ పంటలు పండించవచ్చని మా అత్తల ద్వారా తెలుసుకొని పండిస్తున్నాం. రేపు మా కోడళ్లకు కూడా నేర్పిస్తాం, పంటలతో పలు రకాల వంటలు కూడా ఇపుడు నేర్చుకొని మార్కెట్‌లో అమ్ముతూ స్వయం ఉపాధి పొందుతున్నాం”అని ‘రూరల్‌మీడియా’ తో అన్నారు మహిళాసంఘం సభ్యులు శారద,సుకీర్త. 

మిల్లెట్స్‌తో 52 రకాల వంటలు

 ” అందరికీ పౌష్టికాహారం అందాలన్నా, భూసారం కాపాడుకోవాలన్నా.పాతపంటలే దిక్కు అని మా అత్తలు చెప్పిండ్రు.యాపాకు బూడిద కలిపి ఈత గంపల్లో ఇత్తనాలు దాచుకుంటాం.పంటలకు పెంటెరువులు,జెర్రెల ఎరువులు ఏస్తం.పురుగులకు కషాయాలు కొడతం.దీంతో మస్తుగ దిగుబడి వస్తది. భూములు నిస్సారం కావు.మేం పండించిన చిరుధాన్యాలతో పౌష్టిక విలువలు కలిగిన 52 రకాల రెడీ టూ ఈట్‌ ఆహార పదార్ధాలను తయారు చేస్తున్నాం.” అంటోంది డిడిఎస్‌ సముదాయ ఉత్పత్తి కేంద్రంలో అపరాలతో పలు రకాల స్వీట్లు తయారు చేస్తున్న స్వప్న.  (Pics/ShyamMohan/for millet products contact to DDS/9440048659)


మరింత సమాచారం తెలుసుకోండి: