మేడే....అంతర్జాతీయ కార్మిక సంఘీభావ దినోత్సవం.. దీని నేప‌థ్యం ఏమిటంటే... 19 వ శతాబ్దంలో పారిశ్రామికాభివృద్ది సాధించిన దేశాలలో యజమానులు కేవలం ధనార్జనే ధ్యేయంగా శ్రామికుల కష్టనష్టాలతో ప్రమేయం లేకుండా రోజుకు 16 నుంచి 20 గంటలు పని చేయిస్తూ బానిసల వలే హింసించేవారు. తమ భాధల విముక్తికి శ్రామికోద్యమాలే శరణ్యమనే నగ్న సత్యాన్ని గుర్తించిన శ్రామిక వర్గం తిరగబడింది. ప్రప్రథ‌మంగా అమెరికాలోని ఫిలడెల్ఫియాలో పని గంటల తగ్గింపున‌కు ఉద్యమం ప్రారంభమైంది. ఉద్యమాన్ని ఉదృతం చేసి పరిశ్రమలను స్తంభింపచేసిన కార్మిక ప్రభంజనాన్ని అదుపు చేయలేక గత్యంతరంలేని  స్థితిలో 1837 సం.లో రోజుకు 10 గంట‌ల‌ పనిదినాన్ని అమెరికా ప్రభుత్వం శాసనబద్దం చేసింది
 
అటు తరువాత వివిధ దేశాలలో ఆందోళనలు ప్రారంభమ‌య్యాయి. 1886 మే 1న అమెరికాలోని చికాగో నగరంలో పరిమిత పని దినాలను కోరుతూ లక్షలాది మంది కార్మికులు సమ్మె చేశారు. ప్రదర్శనను చెదరగొట్టేందుకు పోలీసులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. మార్కెట్ ప్రాంతమంతా రక్తసిక్తమై కార్మికుల హాహాకారాలతో దద్దరిల్లింది. ఒక పోలీసు సార్జెంట్‌ను హత్య చేశారనే నిరాధార అభియోగంతో కార్మిక నాయకులైన "సార్సన్...స్పైన్....ఏంగెల్...ఫిషెలను దారుణంగా ఉరి తీశారు. 
 
ఉరికంబమెక్కిన "స్పైన్" నేను ఉరి తీయబడినంత మాత్రాన ఈ అగ్ని జ్వాల అంతరించదు. ప్రపంచ కార్మికులారా ఏకంకండి అని ప్రభోదించాడు. స్పైన్ మరణ నినాదం శ్రామిక జన శంఖారావమై విశ్వవ్యాప్తంగా మార్మోగి శ్రామిక చైతన్యాన్ని రగుల్కొలిపింది. 
 
చికాగో అమరవీరుల సంస్మరణ దినంగా చరిత్రకెక్కిన మే 1 మేడే గా నిలిచిపోయింది. ఈ ఉద్యమం ప్రాదేశిక సరిహద్దులు దాటి ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించి చివరకు శ్రామిక విజయానికి చిహ్నంగా రోజుకు 8 గంట‌ల‌ పని చట్టబద్దం చేయబడింది.  అదే మేడే కు అంకురార్పణ.
 
1890 మే 1వ తేదీన అమెరికా కార్మిక సంస్థ (ఎ.ఫ్.ఎల్) ఏటా మే 1 అంతర్జాతీయ కార్మిక సంఘీభావ దినోత్సవంగా జరపాలని సూచించింది. నాటి నుండి నేటి వరకు ఈ మేడే విశ్వవ్యాప్తంగా ఆచరణీయమైంది. ట్రేడ్ యూనియ‌న్లు గాని, పార్ల‌మెంటు గానీ లేని రష్యాలో 1891 మే 1న మార్కిస్టులు రహస్యంగా తొలిసారిగా అంతర్జాతీయ కార్మిక సంఘీభావ దినోత్సవం జరిపారు. ఆనాటి నుండి మే దినోత్సవ సంబరం రష్యా కార్మిక వర్గ విప్లవాత్మక సంప్రదాయంగా పరిణమించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: