గోదారమ్మ కన్ను ఎర్ర చేసినట్టుంది....గోదావరి మునిగిపోయిన బోటు వెలికితీతకు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడం, గోదావరిలో వరద నీటి ఉధృతి పెరగడంతో పనులను ఆటంకం ఏర్పడింది.సరిగ్గా 20 రోజుల క్రితం...... పర్యాటకులు ఆట పాటలతో ఉల్లాసంగా బోటులో గోదారి అందాలను  తిలకిస్తున్న వేళ అమాంతం బోటు మునిగిపోయింది.
77 మంది ప్రయాణికులతో వెళ్తున్న రాయల్ వశష్ట పున్నమి బోటు తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయింది. 

ఆ సమయంలో స్థానిక మత్స్యకారుల సహకారంతో 26 మంది ప్రయాణికులు ప్రాణాలు దక్కించుకోగలిగినా మిగిలిన వారు గల్లంతయ్యారు. సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టి 36 మృతదేహాలను గుర్తించగా...ఇంకా 15 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. మునిగిన బోటులో మిగిలిన వారి మృతదేహాలు ఉండొచ్చన్న భావనతో బోట్లు వెలికితీయడంలో అనుభవం ఉన్న కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్ సంస్థకు బోటు వెలికితీతకు అధికారులు ఏర్పాటు చేసారు. ఇప్పటి వరకూ సంప్రదాయ పద్ధతిలోనే వెలికితీత పనులు చేపట్టారు.



 ఆ సంస్థకి చెందిన నిపుణుడు ధర్మాడి సత్యం బృందం బోటును బయటకు తీసేందుకు మూడు రోజులుగా ప్రయత్నిస్తున్నప్పటికీసఫలం కాలేదు.ముందుగాఇనుప రోప్‌ను బోటు మునిగిన ప్రాంతంలో వలయాకారంగా వేసి లాగేందుకు యత్నించగా బరువైన వస్తువు తగలడంతో బోటుగా భావించారు.  కానీ రోప్ లాగుతుండగా తెగిపోవడంతో అది బండరాయిగా నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత రోప్‌లకు లంగర్లు కట్టి బోటు మునిగిన ప్రాంతంలో జారవిడిచుకుంటూ వచ్చారు. లంగరుకు తగిలితే ఆ తర్వాత రోప్‌ను ఒడ్డున ఉంచిన పొక్లెయిన్‌కు కట్టి లాగే  ప్రయత్నించగా అది కూడా విఫలమైంది.


చివరికి లంగర్ ఖాళీగానే బయటికొచ్చింది. బోటు వెలికితీసేంత వరకు ప్రయత్నాలు చేస్తామని ధర్మాడి సత్యం బృందం చెబుతోంది. అయితే మూడో రోజు మధ్యాహ్నం నుంచి గోదావరి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడం, గోదావరిలో వరద నీటి ఉధృతి పెరగడంతో వెలికితీత పనులను అధికారులు నిలిపివేశారు. వరద ప్రవాహం కారణంగా మరో ప్రమాదం జరగకూడదన్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయానికి వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. అయితే బోటు మునిగి సుమారు 20 రోజులు అవుతున్నా గల్లంతైన మృతదేహాల  జాడ  లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: