అమెరికాలో ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యులపై ఆ దేశ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యకర పదజాలాన్ని వాడుతూ వారిపై ఆరోపణలకు దిగారు.ట్రంప్‌పై అభిశంసన పెట్టేందుకు డెమోక్రటిక్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.అమెరికా కాంగ్రె‌స్‌లో దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్‌లోని ఆరు కమిటీలు ఈ విచారణను మొదలుపెడతాయని స్పీకర్ నాన్సీ పెలోసీ ఇటీవల ప్రకటించారు. ఈ సభలో డెమోక్రాట్లకు మెజార్టీ ఉంది.

ఉక్రెయిన్‌తో అమెరికా ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన పత్రాలు సమర్పించాలని ఈ కమిటీలు వైట్‌హౌస్ (అధ్యక్ష కార్యాలయం)ను కోరుతున్నాయి.అభిశంసన విచారణలో ఈ విషయం ప్రధానాంశంగా మారింది.అయితే, ఈ విషయంలో కమిటీలకు వైట్‌హౌస్ సహకరించడం లేదని, అవసరమైతే దీనిపై చట్టపరంగా సమన్లు జారీ చేస్తామని డెమోక్రటిక్ నేతలు హెచ్చరించారు.ఈ నేపథ్యంలో ఆ పార్టీ నాయకులను ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. వారు అవినీతి, దేశద్రోహానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.


విచారణ ఎందుకంటే..

వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో డోనల్డ్ ట్రంప్‌పై డెమోక్రటిక్ పార్టీ తరఫున జో బిడెన్ పోటీ చేయాలనుకుంటున్నారు. బిడెన్ కుమారుడు హంటర్ బిడెన్ గతంలో ఓ ఉక్రెయిన్ గ్యాస్ సంస్థలో పనిచేశారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ‌తో ట్రంప్ మాట్లాడిన ఓ ఫోన్ సంభాషణ గురించి హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీకి ఓ అజ్ఞాత ఫిర్యాదు అందింది.సదరు ఫోన్ కాల్‌ సంభాషణలో.. జో బిడెన్, హంటర్ బిడెన్‌లపై విచారణలు చేపట్టాలంటూ జెలెన్స్కీపై ట్రంప్ ఒత్తిడి తెచ్చారు.అయితే, బిడెన్ తప్పు చేసినట్లుగా ఎలాంటి విషయాలూ వెలుగు చూడలేదు.ఈ ఫోన్ సంభాషణ జరిగిన సమయంలో ఉక్రెయిన్‌కు అందించే సైనికపరమైన సాయాన్ని నిలుపుదల చేయాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్నారని డెమోక్రటిక్ నేతలు చెబుతున్నారు.వ్యక్తిగత ప్రయోజనం పొందేందుకు వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలని ట్రంప్ ఉక్రెయిన్‌పై ఒత్తిడి తెచ్చారని వాళ్లు ఆరోపిస్తున్నారు.


ట్రంప్ ఏమన్నారు..

ఫిన్లాండ్ అధ్యక్షుడు సాలీ నినిస్టోతో కలిసి ఓ పాత్రికేయ సమావేశంలో పాల్గొన్న ట్రంప్.. బిడెన్‌పై ఆరోపణలు గుప్పించారు.బిడె‌న్‌ ‘కరడు కట్టిన అవినీతిపరుడ’ని అన్నారు.హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ ఛైర్మన్ ఆడమ్ ష్కిఫ్‌పైనా ట్రంప్ దూషణలకు దిగారు.‘‘ష్కిఫ్ దిగజారిన మనిషి. అవమానంతో ఆయన రాజీనామా చేయాలి. నిజానికి ఆయనపై ‘దేశ ద్రోహం’ కింద విచారణ జరగాలి’’ అని అన్నారు.తనపై వచ్చిన అజ్ఞాత ఫిర్యాదును ట్రంప్ తోసిపుచ్చారు. దాన్ని రాయడంలో ష్కిఫ్ సాయం అందించి ఉంటారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అయితే, దీనికి ఆయన ఎలాంటి ఆధారాలూ చూపలేదు.‘‘నాపై ఫిర్యాదు ఎవరు చేశారో గుర్తించాల్సిన అవసరం ఉంది. నా ఉద్దేశం ప్రకారం అతడు గూఢచర్యానికి పాల్పడ్డాడు. స్వచ్ఛమైన ‘విజిల్ బ్లోయర్స్‌’కే రక్షణ ఉండాలి’’ అని అన్నారు.అభిశంసన విచారణ మొత్తం ఓ ‘కట్టుకథ’ అని, ‘అమెరికా ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న మోసపూరిత నేరం’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.అయితే, కాంగ్రెస్‌కు తాను ‘ఎప్పుడూ సహకరిస్తాన’ని పునరుద్ఘాటించారు.వేటిని ‘దేశ ద్రోహ’ చర్యలుగా పరిగణిస్తున్నారని ప్రశ్నించిన రాయిటర్స్ ప్రతినిధితో ట్రంప్ వాగ్వాదానికి దిగారు.అంతకుముందు ట్విటర్‌లోనూ నాన్సీ పెలోసీ, ష్కిఫ్‌లపై ట్రంప్ విరుచుకుపడ్డారు.


‘‘పనిలేని డెమోక్రాట్లు ఈ చెత్త కోసం అందరి సమయం, శ్రమ వృథా చేయొద్దు. దేశ నిర్మాణంపై దృష్టి పెట్టాలి’’ అని అర్థం వచ్చేలా కొన్ని అసభ్యకర పదాలతో ట్వీట్ చేశారు.ఉక్రెయిన్‌తో అమెరికా ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన పత్రాలు సమర్పించాలని కొన్ని వారాలుగా తాము చేసిన అభ్యర్థనలను వైట్‌హౌస్ పట్టించుకోలేదని హౌస్ ఓవర్‌సైట్ కమిటీ ఛైర్మన్ ఎలిజా కమ్మింగ్స్ ఓ మెమో‌లో తెలిపారు.‘‘మేం చాలా సమయం వేచి చూసి, సమన్లు విధించే దిశగా అడుగు వేస్తున్నాం. కమిటీల అభ్యర్థనలకు వైట్‌హౌస్ కనీసం స్పందించడం లేదు’’ అని పేర్కొన్నారు.


అభిశంసన ప్రక్రియ విషయంలో తమ వైఖరిని వివరిస్తూ నాన్సీ పెలోసీ, ష్కిఫ్ బుధవారం సంయుక్తంగా పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు.‘‘ఈ విచారణ ఇలా సాగుతూ పోవాలని మేం కోరుకోవడం లేదు. విజిల్ బ్లోయర్‌ను ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు బెదిరింపులకు దిగినట్లుగా ఉన్నాయి’’ అని ష్కిఫ్ అన్నారు.అధ్యక్షుడిని కాంగ్రెస్ పదవీచ్యుతుడిని చేసే ప్రక్రియలో అభిశంసన తొలి దశ.విచారణ జరిపి హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ అభిశంసనను ఆమోదిస్తే, ఆ తర్వాత సెనేట్ విచారణ జరపాల్సి ఉంటుంది.సెనేట్‌లోని సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది దోషులుగా తేల్చితే అధ్యక్షుడి పదవి పోతుంది.అయితే, అధికార రిపబ్లికన్ పార్టీకి సెనేట్‌లో మెజార్టీ ఉన్న నేపథ్యంలో ట్రంప్ పదవి పోయే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.


అమెరికా చరిత్రలో ఇంతవరకూ ఇద్దరు అధ్యక్షులు మాత్రమే అభిశంసనను ఎదుర్కొన్నారు. వారు బిల్ క్లింటన్, ఆండ్రూ జాన్సన్. దోషులుగా తేలకపోవడంతో ఆ ఇద్దరూ పదవులు కోల్పోలేదు.1994లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న రిచర్డ్ నిక్సన్.. తనపై అభిశంసన పెట్టే అవకాశాలుండటంతో ముందుగానే రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: