ప్రభుత్వరంగ బ్యాంకులు (PSB) తమ ఉద్యోగులకు దీపావళి పండుగ బొనాంజాను ప్రకటించాయి. వేతన బకాయిల్లో పాక్షిక సొమ్మును ఉద్యోగుల ఖాతాలలో జమ చేయనున్నాయి. యూనియన్లు, యాజమాన్యాల మధ్య వేతన వరణపై తుది ఒప్పందానికి ముందే వారి ఖాతాల్లోకి కొంత వేతన బకాయిలు జమ అవుతున్నాయి. భారత బ్యాంకింగ్ సెక్టార్ హిస్టరీలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.

చర్చలు కొలిక్కి రాకుండా.. రూ.1 లక్ష వరకు.. :
ఉద్యోగులు బకాయిలను ఉంచుకోవచ్చు లేదా తీసుకోవచ్చునని, ఒకవేళ వారు తీసుకుంటే రూ.50,000 కంటే తక్కువ ఉండదని, అలాగే రూ.1,00,000 కంటే ఎక్కువ కూడా ఉండవచ్చునని పీఎస్‌బీ బ్యాంక్ ఉద్యోగి ఒకరు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. వేతనాల పెంపుపై బ్యాంకు ఉద్యోగుల సంఘాలు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇది కొలిక్కి రావాల్సి ఉంది. వేతన సవరణలపై తుది ఒప్పందం కుదరకముందే బకాయిల్లో పాక్షిక చెల్లింపులు జరపడం మాత్రం బ్యాంకింగ్ చరిత్రలో తొలిసారి.

2017 నవంబర్ నుంచి వెయిటింగ్ :
PSB ఉద్యోగులు 2017 నవంబర్ నెల నుంచి వేతన సవరణ కోసం వేచి చూస్తున్నారు. ఇప్పటి వరకు యునైటెడ్ ఫోరమ్ ఫర్ బ్యాంకు యూనియన్స్ (UFBU), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) మధ్య 30 దఫాలుగా చర్చలు జరిగాయి. కానీ ఏకాభిప్రాయానికి రాలేదు.

12 శాతం చొప్పున ఆఫర్.. :
ప్రస్తుతం బ్యాంకుల యాజమాన్యాలు 12 శాతం చొప్పున వేతన పెంపును ఆఫర్ చేస్తున్నాయి. కానీ యూనియన్ మాత్రం అంగీకరించడం లేదు. అయితే 12 శాతానికి తగ్గదు కాబట్టి బకాయిలను ఆ లెక్కన చెల్లించాలని బ్యాంకులు నిర్ణయించాయట. అంటే తాము ఆఫర్ చేస్తున్న ప్రకారంగా పాక్షిక చెల్లింపులు జరుపుతున్నాయి. అయితే చర్చలు కొలిక్కి రాకుండా ఈ చెల్లింపులు సరికాదని UFBU అంటోంది. తాత్కాలికంగా పాక్షిక చెల్లింపులు సరికాదని, వేతన సవరణల విషయంలో బేరసారాల కోసం ఉద్దేశ్యపూర్వకంగా యూనియన్ల పాత్రను అణగదొక్కే చర్య అని చెబుతున్నారు.

పరిష్కారానికి సిద్ధం :
సందర్భాన్ని బట్టి ఉద్యోగులు అధిక సమయం పని చేస్తున్నారని, జన్ ధన్ యోజన అమలు ఇబ్బందులు, నోట్ల రద్దు సమయంలో తీవ్ర ఒత్తిడిని భరించామని చెబుతున్నారు. సవరణ చర్చలు 2017 మే నెలలో ప్రారంభమయ్యాయయని, ఓ సంవత్సరం తర్వాత అంటే 2018లో ఐబీఏ తన మొదటి ఆఫర్ రెండు శాతం ఇచ్చిందని, అందువల్ల ఒక పూర్తి ఏడాది ఎలాంటి చర్చలు లేకుండానే గడిచిపోయిందని, ఈ ఆలస్యం ఐబీఐ కారణమని, దీనికి పరిష్కారం దాని భుజస్కందాలపైనే ఉందని చెబుతున్నారు. వేతన సవరణపై తాము వేగవంతమైన చర్చకు పట్టుబడుతున్నామని, ఇప్పటికీ చర్చల ద్వారా సహేతుక, సంతృప్తికర పరిష్కారానికి తాము సిద్ధమని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకటాచలం అన్నారు. క్రితంసారి 15 శాతం పెంపు ఇచ్చారని, ఇప్పుడు IBA 12 శాతం ఆఫర్ చేస్తోందని, కానీ ఇది సరికాదని, దీనిని పెంచి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: