'ఎంటిటీ లిస్ట్'గా పేర్కొనే నిషేధిత జాబితాలో పెట్టడంతో ఆ 28 సంస్థలు ఇకపై వాషింగ్టన్ అనుమతులు లేకుండా అమెరికా నుంచి ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయలేవు. బ్లాక్‌లిస్టులో పెట్టిన సంస్థల్లో కొన్ని ప్రభుత్వ రంగానికి చెందినవి కాగా మరికొన్ని సర్వేలెన్స్ పరికరాల వ్యాపారం చేసే ప్రయివేట్ టెక్ సంస్థలు.అమెరికా ఇలా చైనాకు చెందిన సంస్థలను వాణిజ్య పరంగా బ్లాక్‌లిస్టులో పెట్టడం ఇదే తొలిసారి కాదు. మేలో చైనాకు చెందిన టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం హ్వావేను కూడా ఈ ఎంటిటీ లిస్టులో పెట్టింది. ఆ సంస్థ ఉత్పత్తులను వాడితే భద్రతాపరమైన సమస్యలు వస్తాయన్న భయంతో ఈ నిర్ణయం తీసుకుంది.


జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, వేధింపుల్లో ఈ 28 సంస్థల పాత్ర కూడా ఉందని అమెరికా వాణిజ్య విభాగం ఆరోపించింది.జిన్‌జియాంగ్‌లోని నిర్బంధ శిబిరాల్లో ఉంటున్నవారిని విపరీతంగా హింసిస్తున్నారని, ముఖ్యంగా ముస్లిం వీగర్లపై అకృత్యాలకు పాల్పడుతున్నారని హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి.ఈ నిర్బంధ శిబిరాలను చైనా తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు నిర్వహిస్తున్న ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లుగా చెబుతోంది.


అమెరికా ఎవరిని లక్ష్యం చేసుకుంది?

ఏకపక్షంగా సాగించిన సామూహిక నిర్బంధాలు.. వీగర్లు, కజక్‌లు, ఇతర ముస్లిం మైనారిటీలపై అత్యాధునిక సాంకేతికత సహాయంతో నిఘా పెట్టడం వంటి చైనా చర్యల్లో ఈ 28 సంస్థల పాత్ర కూడా ఉందని అమెరికా వాణిజ్య విభాగం సోమవారం ప్రకటించింది.


ఎంటిటీ లిస్టులో పెట్టిన వాటిలో జిన్‌జియాంగ్ ప్రావిన్స్ భద్రతా విభాగం, మరో 19 చిన్నచిన్న ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి.మిగతా ఎనిమిది సంస్థల్లో హైక్ విజన్, దహువా టెక్నాలజీ, మెగ్వి టెక్నాలజీ వంటి టెక్ కంపెనీలున్నాయి. ఈ సంస్థలన్నీ ప్రత్యేకంగా ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతను వాడుతున్నాయి.సర్వేలెన్స్ పరికరాల తయారీలో ప్రపంచంలోని పెద్ద సంస్థల్లో హైక్‌విజన్ ఒకటి.


అమెరికా, చైనాల మధ్య ప్రస్తుతం వాణిజ్య యుద్ధం తీవ్ర స్థాయిలో ఉంది. వాణిజ్య ఉద్రిక్తతలన తగ్గించుకోవడానికి చైనా ఇప్పటికే వాషింగ్టన్‌కు ఒక బృందాన్ని కూడా పంపించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: