మూక హింసా ఘటనలపై బహిరంగ లేఖలు రాసిన 49 మంది సెలబ్రెటీలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయడాన్ని కాంగ్రెస్ నేత శశిథరూర్ వ్యతిరేకించారు. తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి ఆయన రెండు పేజీల లేఖ రాశారు. భిన్నాభిప్రాయాలను గౌరవించడంపై ప్రధాని బహిరంగంగా తన వైఖరి స్పష్టం చేయాలన్నారు. భిన్నాభిప్రాయల విషయంలో ప్రధానిపైన, ప్రభుత్వంపైన విమర్శలు వచ్చినప్పటికీ భావ ప్రకటనా స్వేచ్ఛ‌ను కాపాడేందుకు కట్టుబటి ఉంటామని దేశానికి  ఆయన హామీ ఇవ్వాలని శశిథరూర్ కోరారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ వాక్, భావ ప్రకటనా స్వేచ్ఛకు వీలుకల్పించే రాజ్యాంగంలోని 19(1)(ఏ)ను ఆయన ప్రస్తావిస్తూ, రాజ్యంగంలో పేర్కొన్న విలువల పరిరక్షణ విషయంలో ప్రతి ఒక్కరూ ప్రధాని సమాధానం కోసం ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు.

'మూకదాడులు కలతకు గురిచేస్తున్నాయి. మత విద్వేషాలతోనో, పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారనే వదంతుల కారణంగానో ఇలాంటివి జరిగి ఉండవచ్చు. అయితే ఇలాంటివి శీఘ్రగతిని విస్తరిస్తున్నాయి. ఈ విషయాన్ని ఇక్కడి పౌరులే మీ దృష్టికి తీసుకు రావడం సరైన పనే' అని మోదీకి రాసిన లేఖలో శశిథరూర్ పేర్కొన్నారు.
 
'భారతదేశ పౌరులుగా జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలను ఎలాంటి భయం లేకుండా మీ దృష్టికి తీసుకురావాలన్నదే అందిర అభిమతం. మీరు కూడా భావ ప్రకటనా స్వేచ్ఛకు మద్దతిస్తారని అందరూ నమ్ముతున్నారు. అందుకు అనుగుణంగానే మీరు భారత పౌరులతో మనసులో మాట (మన్ కీ బాత్) పంచుకుటున్నారు. అది 'మౌన్ కీ బాత్' కాకూడదు' అని శశిథరూర్ ఆ లేఖలో పేర్కొన్నారు. సెలబ్రెటీలు రాసిన లేఖలోని అభిప్రాయాలను ప్రస్తావిస్తూ, అసమ్మత అనేది లేకుండా ప్రజాస్వామ్యం ఉండదని, భిన్న అభిప్రాయాలు, భిన్న సిద్ధాంతాలు కలయికతోనే దేశ నిర్మాణం జరిగిందని ఆయన అన్నారు. ప్రభుత్వ అభిప్రాయాలతో విభేదించినంత మాత్రాన వారిని శత్రువులు గానో, జాతి వ్యతిరేకులుగానే పరిగణించరాదన్నారు. విమర్శలు లేకుంటే ప్రగతి సాధ్యం కాదని శశిథరూర్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: