పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. అదే సమయంలో కశ్మీర్‌పై చైనా చేసిన ప్రకటన పాక్‌కు సంతోషం కలిగించేలా లేదు.

చైనా విదేశాంగ శాఖ కశ్మీర్‌పై చేసిన ప్రకటన అంతకుముందు కంటే భిన్నంగా ఉంది. "యూఎన్ చార్టర్, దాని ప్రతిపాదనల ప్రకారం కశ్మీర్ సమస్యకు పరిష్కారం వెతకాలని" చైనా ఇటీవల చెప్పింది. కానీ, ఇప్పుడు మాత్రం "భారత్-పాకిస్తాన్ ద్వైపాక్షిక చర్చల ద్వారా కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం వెతుక్కోవాలి" అంటోంది.


చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ భారత పర్యటన ముందు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చైనాలో పర్యటించడంపై చైనా విదేశాంగ శాఖను మీడియా మంగళవారం కొన్ని ప్రశ్నలు అడిగింది. "ఈ రెండు పర్యటనలకూ ఏదైనా సంబంధం ఉందా? పాక్ ప్రధాని ఈ పర్యటనలో కశ్మీర్ అంశం కూడా లేవనెత్తుతారని ఆ దేశ మీడియా చెబుతోంది, మీరేమంటారు? అంది.


సమాధానం ఇచ్చిన చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గ్యాంగ్ షువాంగ్, "కశ్మీర్ అంశంపై చైనా వైఖరిలో ఎలాంటి మార్పూ లేదు. మా వైఖరి పూర్తిగా స్పష్టంగా ఉంది. భారత్-పాకిస్తాన్‌కు మేం చెప్పేది ఒక్కటే. కశ్మీర్‌తో పాటు మిగతా వివాదాలను కూడా ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. దానివల్ల రెండు దేశాల మధ్య పరస్పరం నమ్మకం పెరుగుతుంది. ఆ దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. దానివల్ల భారత్, పాక్ సమస్యలు పరిష్కారం అవుతాయి" అన్నారు.


చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అక్టోబర్ 11, 12 తేదీల్లో రెండు రోజుల పర్యటన కోసం భారత్ వస్తున్నారు. అంతకుముందు, "ఆర్టికల్ 370ని తొలగించిన భారత్ జమ్ము-కశ్మీర్ యధాతథ స్థితిని మార్చేస్తోందని" చైనా చెప్పింది. పాకిస్తాన్ ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వరకూ తీసుకెళ్లింది. అక్కడ దానికి చైనా మద్దతు కూడా లభించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: