దేశమంతటా రంగుల హోలీ సంబరాలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాలూ రంగులతో తడిసి ముద్దవుతున్నాయి. ఈ సంతోష సమయంలో అసలు హోలీ ఎందుకు జరుపుకుంటాం.. ఈ హోలీ సంబరాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి. ఎక్కడెక్కడ ఈ హోలీ సంబరాలు జరుగుతాయి.. ఈ విశేషాలు తెలుసుకుందాం.. 

రాధాకృష్ణుల చిలిపి కలహమే ఈ హోలీ పండుగకు మూల కారణమట. స్నేహితులతో ఆడుకుంటున్న నల్ల కృష్ణయ్యను.. నల్లనివాడు అని రాధ ఆటపట్టించిందట. దాంతో అలగిన కిట్టయ్య తల్లి యశోదమ్మ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడట. దాంతో యశోదమ్మ.. రాధ ముఖానికి రంగులు పూయమని సలహా ఇచ్చిందట. అలా హోలీ సంబరాలు మొదలయ్యాయంటారు. 

ఇంకో కథ కూడా ఉందండోయ్.. శ్రీ విష్ణువు పరమ భక్తుడైన ప్రహ్లాదుడి కథ తెలుసుకదా.. ఆ ప్రహ్లాదున్ని చంపేందుకు అతని అత్త, హిరణ్యకశిపుని చెల్లెలు హోళిక ప్రయత్నించిందట. కానీ ప్రహ్లాదుని కాల్చి చంపబోయి.. ఆ మంటల్లో తానే కాలి బూడిదైందట.. ఆ సందర్భంగానే హోళిక పేరుతో హోలీ జరుపుకుంటారట. 

ఇక ఈ హోళీని క్రీస్తు శకం ఏడో శతాబ్దం నుంచి జరుపుకుంటున్నసారస్వత ఆధారాలున్నాయి. సంస్కృత నాటకం రత్నావళిలో హోలీ ప్రస్తావన ఉందట. ఇక ఉత్తర ప్రదేశ్ లోని ఓ పల్లెలో హోలీ రోజు అమ్మాయిలంతా అబ్బాయిలకు రంగులు పూసి కర్రలతో కొడతారట.  దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో హోలీ వేడుకలు జరుగుతుంటాయి.  

ఇక విదేశాల విషయానికి వస్తే.. నేపాల్లో ఈ హోలీ ఉత్సవాలు వారం రోజుల పాటు జరుగుతాయట. అమెరికాలోని ఉటాహ్ రాష్ట్రంలో ప్రపంచంలోనే అతి పెద్ద హోలీ వేడుక జరుగుతుందట. అక్కడి ఇస్కాన్ మందిరంలో వేలాది మంది ఈ వేడుకల్లో పాల్గొంటారట.  మరి మీరు కూడా ఉత్సాహంగా వేడుక చేసుకుంటున్నారు కదా.. హ్యాపీ హోలీ.. 



మరింత సమాచారం తెలుసుకోండి: