జ్యైష్ఠమాసే త్వమాయాం తు సావిత్రీమర్చయన్తి యాః|

వటమూలే సోపవాసా న తా వైధవ్యమాప్నుయుః||

భూతవిద్ధా న కర్తవ్యా హ్యమావాస్యా చ పూర్ణిమా|

వర్జయిత్వా నరశ్రేష్ఠ సావిత్రీవ్రతముత్తమమ్||

సావిత్రీవ్రతం వినా త్వన్యవ్రతానాం భూతవిద్ధా నిషిద్ధ్యత ఇతి రాద్ధాన్తః|


జ్యేష్ఠబహుళ అమావాస్యను పూర్వవిద్ధగా గ్రహించి వటసావిత్రీ వ్రతము నాచరించవలెను. ఏ స్త్రీలు మఱ్ఱిచెట్టు క్రింద ఉపవాసమునుచేసి యీ వ్రతమును ఆచరిస్తారో వారు వైధవ్యము నొందరు. పూర్ణిమ, అమావాస్యలను పూర్వవిద్ధగా అనగా చతుర్దశితో కలసిన దానినిగా దేనికిన్ని గ్రహింపరాదు. కాని వటసావిత్రీ వ్రతమునకు మాత్రమే అట్లు గ్రహింపవలెను అని స్కాందము చెప్పుచున్నది.


జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ_ ఈ మూడు రోజులు స్తీలు వటసావిత్రీ వ్రతాన్ని ఆచరించాలి. సావిత్రీదేవి యముని ప్రార్థించి తన భర్తను బ్రతికించుకున్న రోజు ఇది. మూడురోజులు కుదరని వారు పూర్ణిమ నాడు గానీ, అమావాస్య నాడైనా దీనిని ఆచరించడం వలన సౌభాగ్యం కలకాలం నిలుస్తుంది.


ఈ రోజున మర్రిచెట్టును పసుపు కుంకుమలతో పూజించి దారానికి పసుపు పూసి ఆ దారాన్ని మర్రిచెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ చుట్టాలి. ఇలా 108 చుట్లు చుట్టడం విశేష ఫల దాయకం.


అంతే కాక ఈ రోజున తిలలు దానం చేసినవారికి అశ్వమేథ యాగము చేసినంత పుణ్యం కలుగుతుంది. ఈ పూర్ణిమనాడు గొడుగు, చెప్పులు, ఉదకుంభము, విసన కర్ర దానము చేయడం వలన సద్గతులు, సంపదలు సిద్ధిస్తాయని విష్ణుపురాణ వచనం.


తిరుపతిలో ఈ మూడు రోజులు ప్రత్యేక అభిషేకములు నిర్వహిస్తారు. అంతే కాక పూరీలో ఈ రోజున జగన్నాథ, బలభద్ర, సుభద్రాదేవి యొక్క మూర్తులను ప్రత్యేక స్నాన వేదిక వద్దకు తెచ్చి స్నాన యాత్రను నిర్వహిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: