తమిళనాడు కాంచీ పురంలోని అత్తి వరదరాజ పెరుమాళ్ దేవుడిని దర్శించుకునేందుకు ఇంకా కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. 40 ఏళ్లకు ఓసారి ఈ దేవుడిని దర్శించుకునే వీలు ఉంది. ఎందుకంటే.. ఇక్కడి దేవుడు ఆలయంలో కాకుండా పుష్కరిణిలోని పెట్టెలో ఉంటాడు. 40 ఏళ్లకు ఒక్కసారే ఆ పెట్టెను బయటకు తీసి స్వామివారిని ఆలయంలో ప్రతిష్టించి 48 రోజుల పాటు పూజిస్తారు.


48 రోజుల పూజల తర్వాత మళ్లీ స్వామిని వెండిపెట్టెలో పెట్టి పుష్కరిణిలోనే భద్రపరుస్తారు. గతంలో 1979లో చివరి సారి ఈ అత్తి వరద రాజ స్వామి పెరుమాళ్ ను బయటకు తీసి 48 రోజుల పాటు పూజించి మళ్లీ వెండి పెట్టెలో పెట్టి భద్రపరిచారు. మళ్లీ ఈ 2019లోనే జులై 2న ఈ వరద రాజ స్వామిని బయటకు తీసి పూజలు ప్రారంభించారు.


అంటే ఈ ఆగస్టు 17 వరకు స్వామి వారిని దర్శించుకోవచ్చు. ఇప్పుడు స్వామి వారిని దర్శించుకోకపోతే.. మళ్లీ 2059 వరకూ ఆగాల్సిందే. అంటే మరో 40 ఏళ్లన్నమాట.. ఇప్పుడు మీకు కనీసం 30 ఏళ్లు ఉన్నా.. స్వామిని దర్శించుకునేందుకు మీరు 70 ఏళ్ల వయస్సులో వెళ్లాల్సఉంటుంది. అరుదుగా వచ్చే దర్శనం కాబట్టి స్వామిని వీక్షించేందుకు దేశ దేశాల నుంచి వస్తున్న లక్షలాది భక్తులతో కాంచీ భక్తజన సముద్రంగా మారింది.


స్వామి వారిని దర్శించుకునేందుకు ముందు ఆన్ లైన్ లోనూ దర్శనం బుక్ చేసుకోవచ్చు. ఇక్కడి శ్రీ అత్తి వరదరాజస్వామి వారికి మరి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ స్వామి వారి విగ్రహం 9 అడుగుల వరకు ఉంటుంది. ఈ విగ్రహం లోహాలతో కాకుండా చెక్కతో ఉండటం ఇక్కడి విశేషం. సాక్షాత్తూ ఆ బ్రహ్మే దేవశిల్పి విశ్వకర్మతో ఈ విగ్రహాన్ని తయారు చేయించి పూజించినట్టు పురాణాలు చెబుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: