ఈ బ్రతుకు జీవన పోరాటంలో నిత్యం మనం చెప్పే అబద్ధాలకు,చేసే చిన్నచిన్నమోసాలకు అంతే ఉండదు.పొద్దున లేచిన దగ్గరినుండి,రాత్రి నిదురించే సమయం వరకు  మానవుడు చేసే సర్వ కర్మల పాపఫలం తలలోఉన్న వెంట్రుకలను చేరుతుంది. అందుకే పాపాలకి నిలయమైన వెంట్రుకలను స్వామికి సమర్పించి,స్వామి ఇప్పటి వరకు చేసిన పాపాలను మీ సన్నిదిలో వది లేస్తున్నాను.ఇకపై నిజాయితీగా,నీతిగా,న్యాయంగా,ధర్మంగా,ఉంటానని మనసులో అనుకుంటూ తలనీలాలు సమర్పించు కోవడమని పెద్దలు చెబుతారు.ఇక పురాణాలను పరిశీలిస్తే,



శ్రీ మహావిష్ణువు దగ్గరకు ఒకనాడు నారదముని వెళ్లి,ఈ కలియుగంలో మానవుల ఆయుషు తక్కువగా వుంటుంది,అందుకే వారు తక్కువ కాలం జీవిస్తున్నారు,తెలిసి,తెలియక ఎన్నో పాపాలు చేస్తూ,భగవంతుడి మీద అస్సలు మనస్సు పెట్టడం లేదని,మీ సృష్టినే మరచి మాయ పంచన చేరి భ్రమలో బ్రతుకుతున్నారని,మరి వారు చేస్తున్న ఈ పాపాల సంగతేంటని అడిగారట, అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారట,నేను వారి పాపాలని కడిగి,వారిని ఉద్ధరించడానికి శ్రీ వేంకటేశ్వర స్వామిగా  కలియుగంలో అవతరిస్తాను.అప్పుడు వారు ఒక్కసారి నా కొండకి వచ్చి,వారి తల నీలాలు సమర్పించి,నా దర్శనం చేసుకుని,ఒక్క ఆర్జిత సేవ చేసినా వారి పాపాలన్ని పటాపంచాలు చేస్తాను,ఈ కర్మ ఫలం నుండి తప్పిస్తాను.అజ్ఞానంలో బ్రతుకుతున్న నా భక్తులుగాని, భక్తులు కానివారుగాని నా హుండిలో డబ్బులు వెయ్యకపోయినా సరే,నేనున్న కొండకు వచ్చి వారి తల నీలాలు సమర్పిస్తే చాలు,



అప్పటివరకు చేసిన పాపాలకు నిష్కృతి లభిస్తుంది,కాని ఒక్క మాట మా పాపాలన్ని తొలిగాయని మళ్లీ యదాతధంగా జీవిస్తే వారు చేసిన పనికి ఫలితం మాత్రం వుండదు సుమీ అని తెలిపారట..ఇదే గాక ఒకసారి స్వామి వారి తల్లి వకుళ మాతకు వెంకటేశ్వరస్వామి వారిజుట్టు కొంచెం ఊడిపోయినట్టు అనిపించి స్వామి వారితో చెబుతుందట. అప్పుడు స్వామి వారు విచారం గా అవును అని వకుళ మాతతో అనగా అప్పుడు వకుళమాత బాధపడకు నాయన నీకు,కలియుగాంతం వరకు నీ భక్తులే వారి తల వెండ్రుకలు సమర్పిస్తారని చెబుతుందట.ఆ అమ్మ ఇచ్చిన అనుగ్రహంతో అప్పటినుండి నేటివరకు తిరుమలకు వచ్చిన భక్తులు తలనీలాలు సమర్పించి స్వామి వారి కృపకు పాత్రులు అవుతుంటారు.ఇక తలనీలాల మొక్కు లేని వారు కనీసం 5 కత్తెరలు అయిన అయ్యవారికి సమర్పించాలని చెబుతారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: