మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. 11 రోజుల పాటు విశేష పూజలందుకున్న ఖైరతాబాద్‌  గణేషుడు జలప్రవేశం చేశాడు. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా ట్యాంక్‌బండ్‌కు వచ్చారు. పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు సమన్వయంతో ఖైరతాబాద్‌ గణేషుడిని అనుకున్న సమయానికే  అంటే మధ్యాహ్నం రెండు గంటల లోపే  నిమజ్జనం పూర్తి చేశారు. 


ఖైరతాబాద్‌లో తొమ్మిదిరోజులు విశేష పూజలందుకున్న శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి నిమజ్జనోత్సవం అశేష జనవాహిని మధ్య ప్రశాంతంగా ముగిసింది. అధికారులు అనుకున్నట్టుగానే మధ్యాహ్నం 1.45 గంటలకు హుస్సేన్ సాగర్‌లో జల ప్రవేశం జరిగింది. వేలాది భక్తులు గణపతి బప్పా మోరియా.. అంటూ నినాదాలు మిన్నంటగా ఆ కార్యక్రమం ముగిసింది. సెప్టెంబర్ 11వ తేదీ అనగా బుధవారం రాత్రి భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరునికి కలశం పూజ  చేశారు. తర్వాత  ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రక్ మీదకు ఎంతో జాగ్రత్తగా గణేశుని విగ్రహాన్ని ఎక్కించారు. ఇందుకు భారీ క్రేన్ ఉపయోగించారు. తమ ఇష్టదైవానికి  ఎలాంటి ఇబ్బందులు జరుగకుండా  వెల్డింగ్ పనులు పూర్తి చేశారు. 61 అడుగుల ఎత్తు 45 టన్నుల బరువున్న విగ్రహాన్ని తరలించేందుకు ఆధునికమైన టెక్నాలజీని వాడి ఉత్సవ కమిటీ సభ్యులు తమ ప్రత్యేకతను  చాటుకున్నారు. ఎఁతో జాగ్రత్తగా.. నెమ్మదిగా ట్యాంగ్ బండ్ వైపు గణనాథుని శోభాయాత్ర కొనసాగించారు.  టెలిఫోన్ భవన్, తెలంగాణ సచివాలయం నుంచి లుంబిని పార్క్ వైపుగా తరలించారు. ఎన్టీఆర్ మార్గ్‌లోని  క్రేన్ నెంబర్ 6 దగ్గర నిమజ్జనం చేశారు. 


ఇప్పటి వరకు ఖైరతాబాద్ గణనాథుడు పూర్తిగా నిమజ్జనం కాకపోవడంపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూ వస్తోంది. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి ఓ అడుగు ముందుకేసింది. విగ్రహం పూర్తిగా నిమజ్జనం అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్, ఇతర అధికారులు చొరవ తీసుకొని నిమజ్జనం జరిగే ప్రదేశాన్ని మార్చేశారు. ఎప్పటిలాగే క్రేన్ నెంబర్ 4దగ్గర కాకుండా క్రేన్ నెంబర్ 6 వద్ద 20 అడుగుల మేర లోతు ఉన్నట్లు నిపుణులు గుర్తించడంతో ఆ ప్రదేశాన్నే భారీ వినాయకుని నిమజ్జనానికి ఎన్నుకున్నారు. అనుకున్న విధంగానే భక్తుల ఆనందోత్సాహాల మధ్య ఖైరతాబాద్ భారీ వినాయకుడిని నిమజ్జనాన్ని ప్రశాతంగా పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే.. ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. 61అడుగులు గణనాథుడు మండపం నుంచి బయల్దేరిన దగ్గర నుంచి శోభాయాత్రలో అశేష సంఖ్యలో భక్తులు కాలినడకన వచ్చారు. గణపతి బప్పా మోరియా అంటూ తన్మయత్వం  చెందుతూ ముందుకు కదిలారు. సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా గడిపారు. మొత్తానికి  శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగిసింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: