తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఈఓ  గా జె.ఎస్‌.వి.ప్రసాద్‌ నియమితులవుతారని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ పెద్దలు ఆయనను టీటీడీ ఈఓగా నియమించాలని భావిస్తున్నారని త్వరలో ఈ మేరకు ఉత్తర్వులు వస్తాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జె.ఎస్‌.వి.ప్రసాద్‌ ఉన్నతవిద్య మరియు స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ శాఖలకు కార్యదర్శిగా ఉన్నారు. నిజాయితీపరుడు, సమర్థుడిగా పేరు పొందిన జె.ఎస్‌.వి.ప్రసాద్‌ను తిరుమల ఈఓగా నియమిస్తే..ప్రస్తుతం 'తిరుమల' విషయంలో జరుగుతున్న గొడవలు చాలా వరకు ముగిసిపోతాయని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన జె.ఎస్‌.వి.ప్రసాద్‌ గతంలో దేవాదాయశాఖ కార్యదర్శిగా పనిచేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో దేవాదాయశాఖను నిర్వహించిన ప్రసాద్‌ అప్పటి ప్రభుత్వ పెద్దలతో సరిగా వ్యవహరించలేకపోయారు. ప్రభుత్వ పెద్దలకు, ఆయనకు మధ్య పొడచూపిన విభేదాల నేపథ్యంలో ఆయన కొన్నాళ్లపాటు సెలవులో వెళ్లిపోయారు. సెలవు నుంచి వచ్చిన ఆయనకు అప్పటి ప్రభుత్వం పశుసంవర్ధకశాఖను కేటాయించింది. దీనిపై ప్రసాద్‌ తన సన్నిహితులతో ఆవేదన వ్యక్తం చేశారట.  తనకు పశుసంవర్థకశాఖను అప్పగించి అవమానిస్తారా.. లేక  పశుసంవర్థకశాఖలో తానేమి చేయాలని బాధపడ్డారని భోగట్టా. అయితే అప్పటి ప్రభుత్వ పెద్దలు ఆయన ఆవేదను పట్టించుకోలేదు. తనను పట్టించుకోని ప్రభుత్వంలో తానెందుకు పనిచేయాలనే భావనతో ఆయనకు  కేంద్ర సర్వీసులకు వెళ్లాలని భావించారు. అంతలోనే ఎన్నికలు రావడం, జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడం వెంట వెంటనే జరిగిపోయాయి. జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనకు కీలకమైన ఉన్నతవిద్యకు కార్యదర్శిగా నియమించింది. కాగా..ఇప్పుడు ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం ఇఒగా నియమించి ప్రభుత్వంపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని ప్రభుత్వ పెద్దల ఆలోచనగా చెబుతున్నారు. మరో వైపు ప్రస్తుతం ఇఒగా ఉన్న సింఘాల్‌ ను ఢిల్లీలోని ఎ.పి భవన్‌ రెసిడెంట్‌ కమీషనర్‌గా నియమిస్తారని తెలుస్తోంది. ఇటీవల దాకా ఎ.పి.భవన్‌ రెసిడెంట్‌ కమీషనర్‌గా ఉన్న ప్రవీణ్‌ ప్రకాష్‌ సిఎం కార్యదర్శిగా నియమితులైన విషయం తెలిసిందే. త్వరలోనే దీనిపై ఉత్తర్వులు వస్తాయంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: