తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ వస్తుందంటే చాలు..పల్లెలు, పట్టణాల్లో ఆడపడుచులు  రంగు రంగు పూలతో బతుకమ్మను అలంకరిస్తారు. బతుకమ్మ పండగ వస్తూందంటే తెలంగాణా పల్లెల్లో నూతన వుత్సాహం వెల్లి విరుస్తుంది. అది ఒక పెద్ద సంబరంగా భావిస్తారు. ఇళ్ళు శుభ్రపరుస్తారు. చక్కగా అలంకరించు కుంటారు. ఆడ పిల్లల్ని పుట్టింటికి తీసుకు వస్తారు. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకు అత్తగారి ఇంటి నుంచి కాగితపు పూలతో చేసిన బతకమ్మను వాయినంగా పంపుతారు.  సాయంత్రం పిల్లు, పెద్దలు, నూతన వస్త్రాలు ధరించి స్త్రీలు, వివిధ అలంకారాలను అలంకరించుకుని బతకమ్మలను చేత బట్టుకుని చెరువు కట్టకో, కాలువ గట్టుకో దేవాలయానికో వెళ్ళి బతకమ్మలను మధ్య వుంచి స్త్రీలు వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు చరుస్తూ, గొంతెత్తి ఒకరు పాడగా వలయాకారంగా తిరుగుతున్న వారు ఆ పాటను అనుసరిస్తూ పాడుతారు.

తెలంగాణలో బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులు పాడుకునే జానపద గేయాలు:

బతకమ్మ బతకమ్మ ఉయ్యాలో

బంగారు బతుకమ్మ ఉయ్యాలో

నానోము పండింది ఉయ్యాలో

నీనోము పండిందా ఉయ్యాలో

మావారు వచ్చిరి ఉయ్యాలో

మీవారు వచ్చిరా ఉయ్యాలో...


బతకమ్మలను పిల్చుకుంటూ పాడే పాట

ఒక్కొక్క వువ్వేసి .. చంద మామ 

ఒక జాము అయే .. చంద మామ 

రెండేసి పువ్వు తీసి..చంద మామ 

రెండు జాము లాయె.. చంద మామ


బొడ్డెమ్మ బొడ్డెమ్మ.... బిడ్డలెందారే
బవిల పడ్డ వారికి ......వారిద్దరమ్మా
చెర్ల బడ్డవికి ..... .. చేరిద్దరమ్మా
కుంట్ల బడ్డ వారుకి.. కోరుద్దరమ్మ
నిద్రపో బొడ్డేమ .... .. నిద్రబోవమ్మ
నిద్రకు నూరేండ్లు...... నీకి వెయ్యేండ్లు
నిను గన్న తల్లికి....... నిండ నూరేంళ్ళు
అంటూ బొడ్డెమ్మను నీటిలో వదులుతారు. 



కోసలాధీశుండు ఉయ్యాలో – దశరథ నాముండు ఉయ్యాలో -
కొండ కోనలు దాటి ఉయ్యాలో – వేటకే బోయెను ఉయ్యాలో -
అడవిలో దిరిగెను ఉయ్యాలో – అటు ఇటు జూచెను ఉయ్యాలో -
చెట్టు గుబురుల చాటు ఉయ్యాలో – చెరువొకటి కనిపించె ఉయ్యాలో -
శబ్దమేదొ వినెను ఉయ్యాలో – శరమును సంధించె ఉయ్యాలో -
జంతువేదొ జచ్చె ఉయ్యాలో – అనుకొని సాగెను ఉయ్యాలో -
చెంతకు చేరగా ఉయ్యాలో – చిత్తమే కుంగెను ఉయ్యాలో -
కుండలో నీళ్ళను ఉయ్యాలో – కొనిపో వచ్చిన ఉయ్యాలో -
బాలుని గుండెలో ఉయ్యాలో – బాణమే గ్రుచ్చెను ఉయ్యాలో -
ఎవ్వరు నువ్వనె ఉయ్యాలో – ఏడ్పుతో దశరథుడు ఉయ్యాలో -
శ్రవణుడు నేననె ఉయ్యాలో – చచ్చేటి బాలుడు ఉయ్యాలో -
తప్పు జరిగెనంచు ఉయ్యాలో – తపియించెను రాజు ఉయ్యాలో -
చావు బతుకుల బాలుడుయ్యాలో – సాయమే కోరెను ఉయ్యాలో -
నా తల్లిదండ్రులు ఉయ్యాలో – దాహంతో ఉండిరి ఉయ్యాలో -
ఈ నీళ్ళు గొంపోయి ఉయ్యాలో – ఇచ్చి రమ్మనెను ఉయ్యాలో -
ఆ నీళ్ళతో రాజు ఉయ్యాలో – అడవంతా వెదికె ఉయ్యాలో -
ఒకచోట జూచెను ఉయ్యాలో – ఒణికేటి దంపతుల ఉయ్యాలో -
కళ్ళైన లేవాయె ఉయ్యాలో – కాళ్ళైన కదలవు ఉయ్యాలో -
వృద్ధ దంపతుల జేరి ఉయ్యాలో – వేదన చెందుతూ ఉయ్యాలో -
సాష్టాంగ పడె రాజు ఉయ్యాలో – సంగతి జెప్పెను ఉయ్యాలో -
పలుకు విన్నంతనే ఉయ్యాలో – పాపమా వృద్ధులు ఉయ్యాలో -
శాపాలు బెట్టిరి ఉయ్యాలో – చాలించిరి తనువులుయ్యాలో -
శాపమే ఫలియించి ఉయ్యాలో – జరిగె రామాయణం ఊయ్యాలో -
లోక కల్యాణమాయె ఉయ్యాలో – లోకమే మెచ్చెను ఉయ్యాలో


మరింత సమాచారం తెలుసుకోండి: