విజయవాడలో దేవీ నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

 

ఎనిమిదవరోజు దుర్గాదేవీ అలంకారంలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులకు అనుమతిస్తున్నారు. మరోవైపు భవానీ దీక్ష విరమణ కోసం కూడా భక్తులు భారీగా అమ్మవారి సన్నిధికి చేరుకుంటున్నారు.

 

అమ్మవారి అవతారాల్లో దుర్గాదేవి రూపానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. దుర్గముడు అనే రాక్షసుడిని సంహారం చేసిన శక్తి స్వరూపం దుర్గాదేవి. కోటి సూర్య ప్రభలతో వెలిగే ఈ దేవి భక్తులను సర్వ దుర్గతుల నుంచి కాపాడుతుంది. ఈమె మహా ప్రకృతి స్వరూపిణి. దుర్గాదేవి ఆకారంలో అమ్మవారు ఎర్రని వస్త్రాన్ని ధరించి, మణులు పొదిగిన కిరీటం ధరించి ఉంటారు. సింహ వాహనాన్ని అధిరోహించి, ఎనిమిది చేతులతో కత్తి, డాలు, గద, శంఖం, కలశం, త్రిశూలం, చక్రం, ధనుర్బాణాలు ధరించి ఉంటుంది.

 

నిత్యం 70 వేల మంది నుంచి లక్షన్నర మంది చొప్పున ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శనానికి వస్తున్నారు భక్తులు. ఉత్సవాల మొత్తం మీద దేవీ నవరాత్రుల కోసం 15లక్షల మంది వరకూ భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు పూర్తిచేశారు. రేపు 18వ తేదీన మహిషాసుర మర్ధినిగా, రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు అమ్మవారు. 25 లక్షల లడ్డూ ప్రసాదం, 25వేల కిలోల పులిహోర ప్రసాదంను దసరా ఉత్సవాల్లో పాల్గొనే భక్తుల కోసం సిద్ధం చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: