కల్కి.. కల్కి భగవాన్... ఇలా బాగా ఫేమస్ అయి మహా విష్ణు అవతారం అని ప్రచారం చేసుకుని, ఆధ్యాత్మిక ముసుగులో వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఏర్పరుచుకున్న కల్కి, అలియాస్ విజయ్ కుమార్ నాయుడు లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మొదట 5 ఎకరాల స్థలంలో ప్రారంభమైన ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం, ఆ తరువాత వేల ఎకరాలకు విస్తరించింది. 


ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఆయన ఆస్తులు బాగానే కూడగట్టారు. దాదాపు రెండువందలకు పైనే బినామీ కంపెనీలను నెలకొల్పి తీవ్ర అవినీతికి పాల్పడ్డాడు వీరు. కల్కితో పాటు ఆయన కొడుకు కృష్ణాజీ, ప్రీతీజి కూడా వందల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను కొత్తగా నెలకొల్పారు. కల్కి ఆస్తుల మొత్తం విలువ ప్రస్తుతం ఎవరు అంచనా వేయలేనంతగా దాదాపు రూ.2 లక్షల కోట్లు లేదా రూ.3 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.


మనీ లాండరింగ్, హవాలా, పన్ను ఎగవేత ఇలా చాలా అక్రమ మార్గాల్లో కల్కి ఇన్ని ఆస్తులను కూడబెట్టినట్టు ఐటీ శాఖ అధికారులు తెలిపారు. మొత్తం నాలుగు వందల మంది ఐటీ అధికారులు టీమ్స్‌ గా విడిపోయి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులోని కల్కి ఆశ్రమాలు మాత్రమే కాకుండా ఆయనకు సంబంధించిన ఇళ్లల్లో సోదాలు జరుపుతున్నారు. సోదాల్లో ఇప్పటివరకు నలభై కోట్లు దొరికినట్టు పూర్తి సమాచారం. అలాగే పది కోట్లు విలువ చేసే బంగారం బిస్కెట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.


ఐటీ అధికారుల దాడులతో కల్కి దంపతులు అజ్ఞాతంలొకి జారుకున్నట్లు సమాచారం. వరదయ్యపాళెంలోని కల్కి ఆశ్రమంలో ప్రధాన నిర్వాహకులైన లోకేష్ దాసాజీ, శ్రీనివాస్ దాసాజీలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇరవై ఐదు ఏళ్ల క్రితం కల్కి ట్రస్టు ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆశ్రమ పేరును తరుచూ మార్చడానికి కారణాలు ఏంటి అన్న దానిపై అధికారులు ఫోకస్ చేశారు. ట్రస్టు ఆస్తులు, బినామీలు, భూములకు సంబంధించిన పత్రాలతో పూర్తి సంచారంతో ఉన్న హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు ఐటీ శాఖ అధికారులు.


మరింత సమాచారం తెలుసుకోండి: