ప్రపంచంలో పవిత్ర భూమిగా చెప్పుకొనేది ఏదైన ఉందంటే అది మన భారతదేశం ఒక్కటేనని గర్వంగా చెప్పవచ్చూ. అందుకే భారతావని పరమ పవిత్రభూమిగా కీర్తికెక్కింది. దానికి నిదర్శనం అన్యమత గురువులు సైతం ఇక్కడి నేల గొప్పతనాన్ని కీర్తించారు అంటే అది చాలదా మన దేశ కీర్తి ఎల్లలు దాటిందనడానికి. ఇక్కడ పవిత్ర ప్రదేశాలు, పుణ్యనదులు, క్షేత్రాలకు కొదవలేదు. అలాంటి వాటిలో బ్రహ్మచే సృష్టించబడి సకల పాపాలను పరిహరింపచేసే శక్తిగల ఒక తీర్థం ఒకటుందని మీకు తెలుసా తెలియకుంటే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం…


పూర్వకాలంలో 88 వేలమంది ఋషులు చతుర్ముఖ బ్రహ్మ దగ్గరకి వెళ్ళి, వారు తపస్సు చేసుకోవటానికి అనుకూలమైన స్థలం ఏదో తెలపమని అడిగితే, అప్పుడు బ్రహ్మ తన మనోబలంతో ఒక చక్రాన్ని తయారుచేసి, ఆ చక్రాన్ని వదిలి, ఆ చక్రం ఎక్కడ ఆగుతుందో అదే అనుకూలమైనది అని చెప్పాడు. అలా ఆ చక్రం తిరుగుతూ, తిరుగుతూ ఉండగా దానినే అనుసరిస్తూ ఋషులంతా వెళ్ళారు. ఆ చక్రం 14 లోకాలు తిరుగి ఎక్కడా ఆగకుండా నైమిశారణ్యంలోకి వచ్చింది. ఈ స్థలం భూమికి మధ్యభాగం అని, ఋషులు తపస్సు చేసుకోవటానికి అనుకూలమైన ప్రాంతమని, సత్కర్మయాగయజ్ఞాలు ఇక్కడ చేసుకోవచ్చు అని బ్రహ్మ చెప్పాడు.


కాని ఆ చక్రం భూమిని తవ్వుకుంటూ పాతాళమునకు వెళ్ళిపోతూ ఉంటే ఋషులు భయపడటం చూసి, బ్రహ్మ ఆదిపరాశక్తిని ప్రార్థించాడు. బ్రహ్మ యొక్క ప్రార్థనను విన్న లలితాదేవి ఆ చక్రాన్ని ఆపింది.అప్పటినుండి ఈ స్థలం నైమిశారణ్యమై లలితాదేవి ఇక్కడ ప్రత్యక్షమై ఋషుల కోరిక ప్రకారం ఇక్కడ జరిగే హోమ, యజ్ఞ, యాగములను జయప్రదం చేస్తూ, వారి జీవితాల్లో నిరాశ లేకుండా అన్నీ సఫలం అయ్యేటట్టు చేస్తోంది. బ్రహ్మ తన హృదయం నుండి సృష్టించిన మనోమయ చక్రం నేమి అంటే ‘అంచు చీలిన ప్రదేశం‘ అగుటచే ఇది నైమిశారణ్యంగా పిలువబడుతోంది.


చక్రతీర్థంలో స్నానంచేసిన వారికి కష్టములు తొలగిపోయి ముక్తిని పొందుతారు. చక్రతీర్థంలో స్నానం చేస్తే సూర్యగ్రహణం సమయంలో కురుక్షేత్రంలో స్నానం చేసినంత ఫలితం లభిస్తుందని పెద్దలు చెబుతారు. ఇకపోతే ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌ జిల్లాలో లక్నోకు 94కి.మీ. దూరంలో గోమతినది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతమే నైమిశారణ్యంగా పిలవబడుతుంది.  ఇకపోతే  నైమిశారణ్యంలోనే వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించినట్లు చెబుతారు. మహాభారతంతో పాటు రామాయణం, వాయుపురాణం, వరాహపురాణాల్లో నైమిశారణ్యం ప్రస్తావన ఉంది. అదీగాక నైమిశారణ్యం వైష్ణవ దివ్య ప్రదేశాల్లో  ఒకటి..


మరింత సమాచారం తెలుసుకోండి: