పరిపూర్ణ భక్తిని సాధించిన సాధకునికి పరిసరాలతో గాని పరులతోగాని బాంధవ్యాలు చాలా తక్కువగా ఉంటాయి. తనప్రపంచం మొత్తం భగవంతుని చుట్టే అల్లుకోబడి ఉంటుంది. భక్తి సాధనలో తనను తాను మైమరచి అను నిత్యం ఆధ్యాత్మిక చింతనలో జీవిస్తుంటాడు. ఇకపోతే భక్తికి పరాకాష్ట ఆత్మనివేదనం. ఆత్మనివేదనము అంటే పరిపూర్ణ శరణాగతి. తనని తాను పూర్తిగా అంటే మనసా,వాచా, కర్మణా సమర్పించుకుని భగవంతుని నుంచి ఏమీ ఆశించకుండా ఉండటం.. తన చుట్టూ గాని కళ్లముందుగాని ఏది జరిగినా ప్రశాంత మనస్సుతో భగవంతునికి కృతజ్ఞతలు సమర్పించడమే. వచ్చే ఫలితాన్ని వినయంగా స్వీకరించడమే.


అంతే కాకుండా ఆత్మనివేదనములో భగవంతుడు, భక్తుడు ఒక్కటైపోతారు. ఆ భక్తుడు భగవంతునిలో లీనమై దైవమయమైపోతాడు. స్వామి మాటల్లో శరణాగతి అంటే మూడు రకములు. "నేను నీవాడిని, నీవు నా వాడివి" , "నీవే నేను" , "నేనే నీవు''.. ''నీవే నేను" అన్నది ఆత్మ నివేదనములో చివరిది. ఈ స్ధితికి ఎలా చేరుకోగలము? దారిలోనున్న అతి కష్టమైన "సందేహం" అనే బండరాళ్ళు, 'అహం, మమకారం' అనే ముళ్ళ కంచెలు దాటితేనే గమ్యం చేరగలము. విమర్శలనే తుఫానులు, అవమానాలనే సుడిగుండాలు వీటిని ఎదుర్కొంటేనే భక్తి అనే నావ ఆత్మనివేదనం అనే తీరానికి చేరుకుంటుంది.


భక్తికి పరాకాష్ట  అయిన ఈ దశలో సాధకుడు భగవంతుని యందు సంపూర్ణ శరణాగతి భావములో సర్వము భగత్సంకల్పమునకు విడిచి పెట్టి తన్నుతాను భగవంతునికి అర్పించుకుంటాడు. ఇదే ఆత్మనివేదనం. "భగవంతుడా! నాదన్నది ఏమున్నది ఈ లోకంలో ? సర్వము నీదే!" అనే ఆత్మార్పిత భావముతో తనను తాను అర్పితము గావించుకున్న బలి చక్రవర్తి ఇందుకు చక్కని ఉదాహరణ. ఇకపోతే పుట్తేటప్పుడు ఏమి తీసుకురాం, కాని పోయేటప్పుడు మాత్రం మంచిచెడులు మూటకట్టుకుపోతాం. ఇవే మానవుని వెంటవచ్చే ధనధాన్యాలు. అందుకే భగవంతునికి తననుతాను నివేధించుకున్న వారికి మోక్షమే వెంట వస్తుంది గాని మంచిచెడులనేవి వారి వెంట ఉండవు...


మరింత సమాచారం తెలుసుకోండి: