గుడ్లగూబను ఒక మాంసం తినే పక్షిగానే కాదు, శుభ-అశుభాలకు జోడించి కూడా చూస్తుంటారు. రాత్రి గుడ్లగూబ కూత పెడితే దానిని అపశకునంగా, దురదృష్టంగా భావిస్తుంటారు.గుడ్లగూబలను కొందరు చాలా తెలివైనవిగా భావిస్తే, కొందరు మాత్రం వాటికి తెలివి లేదని, అపశకునం అని భావిస్తారు. దీపావళి రాగానే తమ స్వార్థం కోసం గుడ్లగూబలను బలివ్వడానికి సిద్ధమవుతారు. అమావాస్య పూజల పేరుతో ఇప్పటికీ గుడ్లగూబలను బలి ఇస్తున్నారు.


అమావాస్య రాత్రి జరిగే తాంత్రిక పూజల్లో కొందరు గుడ్లగూబలను బలి ఇస్తారు.ఆ పూజలు చేసేవారికి తాంత్రికులు కొన్ని ఆచారాలు పాటించాలని చెబుతారు. శారీరక సంబంధాలు పెట్టుకోకూడదని, శరీరంపై అవాంఛిత రోమాలు ఉండకూడదని, అర్థరాత్రి స్నానం చేయాలని చెబుతారు.తర్వాత ఒక తెల్లటి పంచె కట్టుకోవాలని, పై భాగం నగ్నంగా ఉండాలని చెబుతారు. ఆ తర్వాత కళ్లు మూసుకుని కూచోవాలంటారు.


ఎదురుగా కూర్చున్న మంత్రగాడు మంత్రాలను చదువుతూ పూజలు చేయడం మొదలుపెడతాడు. ఇవి రకరకాలుగా ఉంటాయి. అప్పుడప్పుడు పిరియడ్స్ మొదలైన అమ్మాయిలు ఉపయోగించిన శానిటరీ న్యాప్‌కిన్‌ను గుడ్లగూబకు చుట్టి కాల్చేస్తారు. ఒక్కోసారి కొత్తగా పెళ్లైన మహిళ నెలసరి సమయంలో ఉపయోగించిన లోదుస్తులను చుట్టి తగలబెడతారు.ఈ మంత్ర తంత్రాలు జరుగుతున్న సమయంలో ఆ చుట్టుపక్కలకు చిన్నపిల్లలు, మహిళలు రాకుండా చూసుకుంటారు.ఒకవేళ ఎవరైనా మహిళలు దానిని ఆసక్తిగా గమనిస్తే, ఆమె జీవితంలో పిల్లలు పుట్టరని, పిల్లలెవరైనా వాటిని చూస్తే చనిపోతారని భయపెడతారు.


ఈ సీజన్‌లో గుడ్లగూబలను భారీ ధరకు అమ్ముతారు. ఒక్కో గుడ్లగూబ రేటు 30 వేల వరకూ పలుకుతుంది. దిల్లీలో ఒక గుడ్లగూబను 50 వేలకు అమ్ముతామని చెప్పే వాళ్లు కూడా కొందరు కనిపిస్తారు. కానీ వాళ్లు మాత్రం జైపూర్ లేదా మీరట్ నుంచి ఒక్కోదాన్ని మూడు లేదా నాలుగు వందలకే కొనుక్కొస్తుంటారు.మూడు వందలకు కొన్న గుడ్లగూబ ధర 30 వేలు అవడం వెనుక ఒకే ఒక కారణం ఉంది. మూఢనమ్మకం. లక్ష్మీ పూజ రాత్రి గుడ్లగూబను బలి ఇవ్వడం వల్ల తర్వాత ఏడాది వరకూ వాళ్ల ధనధాన్యాలు, సుఖసంపదలు అలాగే ఉంటాయని కొందరు నమ్ముతారు.



మరింత సమాచారం తెలుసుకోండి: