అయోధ్యలో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా నిన్న జరిగిన దీపోత్సవం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్స్‌లో స్థానం సంపాదించుకుంది. దేదీప్యమానంగా వెలిగిన ఆరు లక్షల దీపాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సరయూ నది తీరంలో ఆధ్యాత్మిక శోభ వెల్లి విరిసింది.



వందలు... వేలు కాదు... అక్షరాల ఆరు లక్షలకు పైగా దీపాలు కొలువుదీరాయి. రామజన్మభూమి అయిన అయోధ్యలోని సరయూ నది తీరంలో కనిపించిన ఈ దృశ్యాన్ని చూడానికి భక్తులకు రెండు కళ్లూ చాల లేదు. అందుకే రామ్‌ కీ పైడీ ఘాట్‌లో యూపీ ప్రభుత్వం నిర్వహించిన ఈ దీపోత్సవం గిన్నిస్‌ బుక్‌లో సైతం స్థానం సంపాదించుకుంది. సరయూ నది తీరంలో గత ఏడాది జరిగిన దీపోత్సవంలో 3 లక్షల ఒక వేయి నూట పదహారు దీపాలను వెలిగించారు. దీంతో అప్పట్లో అది సరికొత్త ప్రపంచ రికార్డుగా అవతరించింది. ఈ సారి 4 లక్షల 10 వేల దీపాలను వెలిగించి, పాత రికార్డును బ్రేక్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది యూపీ ప్రభుత్వం. అనుకున్నట్టుగానే ఆ లక్ష్యాన్ని సాధించింది. దీంతో సరికొత్త రికార్డు నెలకొల్పినట్టు గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు ప్రకటించారు. 


 
4 లక్షల దీపాలకు అదనంగా... మరో 2 లక్షలకు పైగా దీపాలను సరయూ ఘాట్‌లపై వెలిగించారు భక్తులు. దీంతో ఈ సారి సరయూ తీరంలో ఆరు లక్షలకు పైగా మట్టి దీపాలు దేదీప్యమానంగా వెలిగాయి. దీపావళి వేడుకల్లో భాగంగా సరయూ నదీ తీరంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.  యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, యూపీ గవర్నర్ ఆనందీ బెన్‌తో పాటు ఫిజి మంత్రి వీణాకుమార్‌ భట్నాగర్‌ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రాముడు పుట్టిన గడ్డకు రావడం నా అదృష్టం అంటూ వీణా భట్నాగర్‌ హిందీలో చేసిన ప్రసంగం ఆందర్నీ ఆకట్టుకుంది. అలాగే రాముడిపై పాట పాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు వీణా భట్నాగర్. దీపావళి సందర్భంగా రామకథ పార్క్‌లో రాజ తిలకం కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్‌. ఈ సందర్భంగా అయోధ్యలో 226 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: