దీపావళిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఒక్కొక్కరిది ఒక్కో ఆచారం, సాంప్రదాయం.  కరీంనగర్‌లోని కార్ఖానాగడ్డ లో మాత్రం  దేశంలో ఎక్కడా కనిపించని, వినిపించని విధంగా  దీపావళి జరుపుకుంటారు. స్మశానం ... దీపావళి. రెండు విరుద్ధమైనవి. ఒకటి అశుభం ఐతే రెండవది ఎంతో పవిత్రమైన రోజు. మరి ఇంత పవిత్రమైన దీపావళి రోజున స్మశానంకి ఏంటి సంబంధం అంటారా? ఎప్పుడు ప్రేత కళ ఉట్టిపడే స్మశానాలు... దీపావళి రోజున అక్కడ మాత్రం రంగురంగుల మతాబుల వెలుతురులో వెలిగిపోతాయి. 


పెద్ద ఎత్తున తరలివచ్చే వారితో జాతరకు ఏమాత్రం తీసిపోని విధంగా జనసందోహంగా మారిపోతుంటాయి.  దీపావళిని స్మశానంలో తమ పెద్దల సమాధుల మధ్య జరుపుకునే ఆనవాయితీ కరీంనగర్‌లోని కార్ఖానాగడ్డ దళిత వాడల్లో తరాలుగా వస్తోంది. పండగకు ఒక వారం రోజుల ముందు నుండే సంబరాల నిర్వహణకు అవసరమయ్యే ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమవుతారు అక్కడి ప్రజలు.


తమ అస్థిత్వానికి కారణమైన తమ పెద్దలను సంవత్సరానికి ఒకసారి తలుచుకునేందుకే ఓ రోజు నిర్ణయించుకున్నాయి అక్కడి కుటుంబాలు.  అలా మొదలయినవే ఈ స్మశాన దీపావళి సంబరాలు.   తమ పూర్వీకుల సమాధుల వద్ద పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని శుభ్రపరి , సమాధులను కడిగి రంగులను వేస్తారు. అన్ని సమాధుల్లో కెల్లా తమ వారివి  ఆకర్షణీయంగా ఉండాలన్న తపనతో వాటిని పూలు, విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. సిద్దం చేసిన సమాధుల వద్ద తనతో పాటు తెచ్చిన తమ పూర్వీకులకు ఇష్టమైన ఆహారపదార్థాలను నైవేధ్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు.

ఈ వేడుకలకు దూరప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులంతా తప్పకుండా హాజరై తమ కుటుంబ అభివృద్ది కోసం పూర్వీకులు చేసిన సేవలను గుర్తు చేసుకుంటారు. పూజాకార్యక్రమాలు పూర్తైన తర్వాత అక్కడే సమాధుల మధ్య బాణాసంచ పేల్చి స్మశానంలోనే పండగను జరుపుకుంటారు. దీంతో మామూలు సమయాల్లో ప్రేతకళ ఉట్టేపడే శ్మశానం దీపావళి వేళ చిన్న పెద్దల కలయికతో సంబరాలకు వేదికవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: