ఈ వ్రతాన్ని ఎవరైనా, ఏ వయసువారైనా పేద-ధనిక, తరతమ తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు. సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా…. వేకువ జామున లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమాచరించి, దానధర్మాలు, దేవతాపూజలు చేసినట్లయితే… దానివల్ల అనన్యమైన పుణ్యఫలితాన్ని పొందగలరు. కార్తీకమాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ… విష్ణుసహస్రనామార్చన, శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చేయాలి.


వ్రతవిధానం గురించి తెలుసుకుందా మరి.. ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, నదికిపోయి, స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారయణ, పరమేశ్వరులకు, బైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత నీటిలో మునిగి, సూర్యభగవానుడికి అర్ఘ్యపాదాలను సమర్పించి, పితృదేవతలకు క్రమప్రకారం తర్పణలు చేయాలి.

గట్టుపై మూడు దోసిళ్ల నీరు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరీ, తుంగభద్ర, యుమన తదితర నదుల్లో ఏ ఒక్కనదిలోనైనా స్నానం చేసినట్లయితే… గొప్ప ఫలితం లభిస్తుంది. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని, శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకొచ్చి, నిత్యధూప, దీప, నైవేద్యాలతో భగవంతుని పూజచేయాలి. గంధము తీసి, భగవంతునికి సమర్పించి, తానూ బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత అతిథిని పూజించి, వారికి ప్రసాదం పెట్టి, తన ఇంటివద్దగానీ, దేవాలయంలోగానీ, రావిచెట్టు మొదటగానీ కూర్చొని కార్తీకపురాణం చదవాలి. 


ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి, విశాలయంలోగానీ, విష్ణు ఆలయంలోగానీ, తులసికోట వద్దగానీ, దీపారాధన చేసి, శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి, స్వామికి నివేదించాలి. అందరికీ పంచి, తానూ భుజించాలి. తర్వాతిరోజు మృష్టాన్నంతో భూతతృప్తిచేయాలి. ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు, మగవారు గతంలో, గతజన్మలో చేసిన పాపాలు, ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు, వీలు పడనివారు వ్రతాన్ని చూసినా, వ్రతం చేసినవారికి నమస్కరించినా… వారికి కూడా సమాన ఫలితం వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: