కార్తీక మాసం అంటేనే ఎంతగానో విశిష్టత సంతరించుకున్న రోజు. ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటాం.. ఇక ఈ పౌర్ణమి శివరాత్రితో సమానమైందని, దీన్ని త్రిపురారి పౌర్ణమి అనికూడా అంటారని చెబుతారు.. హరిహరులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన ఈ రోజన దీప దానం చేస్తే సకల పాపాలు తొలగి, మోక్షం కలుగుతుందని భక్తుల్లో ప్రగాఢ విశ్వాసం ఉంది.. దీనివల్ల సమస్త జ్ఞానం కలుగుతుందని, సకల సంపదలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. 


ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇక ఈ కార్తీక పౌర్ణమిని ‘దేవ దీపావళి’గా అభివర్ణిస్తారు. ఈ కార్తీక పున్నమి వేడుకలు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నుంచే మొదలవుతాయి. కార్తీక శుద్ధ ఏకాదశిని ‘ప్రబోధ ఏకాదశి’ అని, ప్రబోధిని ఏకాదశి’ అని కూడా అంటారు. కార్తీక శుద్ధ ఏకాదశి నాటితో చాతుర్మాస వ్రతం పూర్తవుతుంది. ఇక శ్రీమహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రలోకి జారుకుని, కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు అని మన పురాణాల్లో చెప్పబడింది.


ఇక ఏటా కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక పున్నమి వరకు రాజస్తాన్‌లోని బ్రహ్మదేవుడి ఆలయం ఉన్న పుష్కర క్షేత్రంలో బ్రహ్మదేవుడి ప్రీత్యర్థం జరిగే పుష్కర మేళా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఐదు రోజులూ భక్తులు పుష్కర తీర్థంలో పవిత్ర స్థానాలను అతి పవిత్రంగా ఆచరిస్తారు. ఇకపోతే కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తిరుపతిలోని కపిలతీర్థం శ్రీకపిలేశ్వరస్వామి ఆలయంలో తితిదే ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా కపిలతీర్థానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు.


ఇదే కాకుండా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వద్ద ఉన్న వశిష్ట గోదావరి తీరంలో భక్తుల రద్దీ నెలకొంది. వలందర్‌ ఘాట్‌, అమరేశ్వర ఘాట్‌లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం దుర్గా లక్ష్మణేశ్వర స్వామికి పంచామృతభిషేకం నిర్వహిస్తున్నారు. నరసాపురం కపిలమల్లేశ్వరస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరోవైపు భద్రాచలంలోని గోదావరి నది వద్ద భక్తుల రద్దీ పెరిగింది.


కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అంతేకాకుండా గోదావరి నదిలో కార్తీక దీపాలు వదులుతున్నారు. ఇక అన్ని రాష్ట్రాల్లోని హిందువులకు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి శివాలయంలో రుద్రాభిషేకం చేయిస్తే జన్మజన్మాల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ఇదే కాకుండా కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వరుని వ్రతం, సత్యదేవుని వ్రతం చేసుకుంటారు. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నోము నోచుకుంటారు. నక్షత్ర దర్శనం అయ్యాక ఫలహారం తీసుకుంటారు... ఇదండీ కార్తీక మాసం విశిష్టత.


మరింత సమాచారం తెలుసుకోండి: