రామ మందిర నిర్మాణ పర్యవేక్షణకు ప్రధాని మోడీ, కేంద్రమత్రి అమిత్‌ షా దూరంగా ఉంటారా? అయోధ్య ట్రస్ట్‌.. సోమనాథ్‌ ట్రస్ట్ కంటే పెద్దదిగా ఉంటుందా? ధార్మిక వ్యవహారల్లో దిట్టయిన రాజకీయ ప్రముఖుడి ఆధ్వర్యంలో ట్రస్ట్‌ ఏర్పాటు చేస్తారా? స్థానికుల కోటాలో ట్రస్ట్‌లో చోటు సంపాదించే అయోధ్య వాసులెవరు? 


గుజరాత్‌లోని సోమనాథ్‌ ట్రస్ట్‌లో సభ్యులు ఏడుగురే. అప్పటికి అదే పెద్దది. కానీ అయోధ్య అలా కాదు. వ్యవహారం చాలా పెద్దది.  సంఘ్‌ పరివార్‌కు చెందిన  సంస్థల నుంచి సభ్యులు ఎక్కవ సంఖ్యలోనే ఉంటారని ప్రచారం జరుగుతోంది. అలాగే నిర్మాణంలో ఆర్.ఎస్.ఎస్ పెద్దల అభిప్రాయాలు కూడా తీసుకొంటారని అంటున్నారు. ట్రస్ట్‌ ఎంపిక మొత్తం ప్రధాని పర్యవేక్షణలో జరుగుతుందనీ.. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ట్రస్ట్‌ పనిచేస్తుందని చెబుతున్నారు. ధార్మిక వ్యవహారాల్లో దిట్ట అయిన రాజకీయ ప్రముఖుడి ఆధ్వర్యంలో ట్రస్ట్‌ ఏర్పాటవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో రామజన్మభూమి న్యాస్‌, సంఘ్‌ పరివార్‌ సంస్థలకు చెందిన వారే కాకుండా స్థానికుల కోటాలో అయోధ్య వాసులకు కూడా చోటు దక్కుతుందనే ప్రచారం ఉంది. 


ట్రస్ట్‌ విషయంలో సాధు సంతులు కొన్ని డిమాండ్లు చేస్తున్నారు. దశాబ్దాలుగా రామ్‌లల్లాకు రోజువారీ పూజలు, సేవలు, అర్చనలు హనుమాన్‌ గడీలోని సాధు సంతులే చేస్తున్నారు. అందుకే ఈ గడీ అఖాడా వారితోనే ట్రస్ట్‌ ఏర్పడాలన్నది సాధువుల డిమాండ్‌. అయోధ్యలో మొత్తం 13 అఖాడాలున్నాయి. ఈ అఖాడాలకు చెందిన సాధువులకు ట్రస్ట్‌లో చోటు కల్పించాలనే డిమాండ్‌ కూడా ఉంది. సుప్రీంకోర్టులో తీర్పు మందిరానికి అనుకూలంగా వస్తే.. మహంత్‌ ధరమ్‌ దాస్‌ను ప్రధాన అర్చకుడిని చేయాలని 2017 డిసెంబరు 29న జరిగిన అఖిలభారత అఖాడా పరిషత్‌ సమావేశంలో నిర్ణయం కూడా తీసుకున్నారు. అందుకే ట్రస్ట్‌లోకి ధరమ్‌దాస్‌ను తీసుకుంటారని అనుకుంటున్నారు. 1949లో బాబ్రీ మసీదులో బాలరాముడి విగ్రహాలను రహస్యంగా ప్రతిష్ఠించిన వారిలో ఒకరైన రామ్‌ఘాట్ కోవెల ప్రధాన పూజారి బాబా అభిమార్‌దాస్‌ శిష్యుడే ధరమ్‌దాస్‌. ఇక ట్రస్ట్‌పై కన్నేసిన వారిలో మహంత్‌ రామచంద్రదాస్‌ పరమహంస వారసులు కూడా ఉన్నారు. 


ట్రస్ట్‌ ఏర్పాటు సరే.. ఆలయంలో ఉండే విశేషాలకు కొదవేం లేదు. వాటి గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువేనంటున్నారు వి.హెచ్.పి నాయకులు. మందిరంలో సింహద్వారం, నృత్య మండపం, రంగమండపం, పూజ గదులు, ప్రదక్షిణ ఆవరణతో కూడిన గర్భాలయం చాలా ముఖ్యమైనవిగా చెబుతున్నారు. వీటికి తోడు కథా మండపం, ప్రాంగణ దర్శన మార్గం, ప్రతీక్షాలయ ప్రాంగణం, భోజనాలయం, తులసీ బాగన్‌, యజ్ఞశాల, గోశాల, భోగ, సేవా మండపాలు, వేద గురుకులం, సాధన-ధ్యాన మందిరం ఇలా ప్రత్యేకతలు ఉంటాయి. సాధువులకు ప్రత్యేక విశ్రాంతి గదులు, నివాస కేంద్రాలు, వేద పారాయణ కేంద్రాలు, యాత్రికుల వసతి గృహాలు, అధికారులకు ప్రత్యేక భవనాలను.. 2.77 ఎకరాలకు ఆనుకుని సేకరించిన 65 ఎకరాల స్థలంలో నిర్మించాలన్నది ఒక సూచన. 


మరింత సమాచారం తెలుసుకోండి: