తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. అదేంటంటే తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన లడ్డూ ప్రసాదం ధర భారీగా పెంచే ఆలోచనలో టీటీడీ దేవస్థానం ఉన్నట్టు సమాచారం. లడ్డూ పంపిణీ, విక్రయాల్లో రాయితీలన్నింటినీ రద్దు చేసేలా టీటీడీ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. అయితే ఇప్పుడు ఉన్న ధరకు రెట్టింపు రూ.50 చెయ్యాలని టీటీడీ యేచిస్తున్నట్టు సమాచారం. 


ఇక నుండి శ్రీవారిని దర్శనం చేసుకునే భక్తులందరికీ 160-180 గ్రాముల లడ్డును ఉచితంగా ఇవ్వాలని, ఆపైన ప్రతి లడ్డు 50 రూపాయలకు విక్రయించేలా టీటీడీ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఉచిత దర్శనాలు, రూ.300, వీఐపీ బ్రేక్‌ టికెట్ల ద్వారా స్వామిని దర్శించుకునే భక్తులకు ఇస్తున్న రాయితీలను రద్దు చేయడం ద్వారా లడ్డూల విక్రయాల్లో వస్తున్న నష్టాన్ని పూడ్చుకోవాలని భావిస్తున్నారు. 


అదనపు ఈవో ధర్మారెడ్డి నిన్న (మంగళవారం) అధికారులతో జరిపిన సమీక్ష సమావేశంలో లడ్డు ధర పెంపుకు సంబంధించిన విధివిధానాలపై చర్చించారు. కాగా రాయితీ లడ్డువల్ల ప్రతి ఏటా టీటీడీకి రూ.2412 కోట్ల నష్టం వస్తుంది. కాగా కేవలం శ్రీవారిని దర్శించుకున్న వారికీ మాత్రమే లడ్డు అందేలా.. ల‌డ్డూ టోకెన్ల దుర్వినియోగాన్ని అరిక‌ట్టేందుకు రెండంచెల స్కానింగ్ విధానాన్ని 30 రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తామని టీటీడీ నిర్ణయం తీసుకుంది. 


స‌ర్వ‌ద‌ర్శ‌నం, దివ్య‌ద‌ర్శ‌నం కాంప్లెక్సుల్లో మొద‌ట ల‌డ్డూ టోకెన్ల‌ను స్కాన్ చేసి భ‌క్తుల‌కు అందిస్తార‌ని, తిరిగి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని స్కానింగ్ పాయింట్ దగ్గర మ‌రోసారి స్కాన్ చేసేలా నూత‌న విధానాన్ని రూపొందిస్తున్నామ‌ని చెప్పారు. రెండోసారి స్కాన్ చేసిన స‌మాచారం మాత్ర‌మే లడ్డూ కౌంట‌ర్ల‌కు చేరుతుంది అని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: