శ్రీవారి భక్తులకు మరింత తీపి కబురు. స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డు ప్రసాదం అందించాలని భావిస్తోంది టీటీడీ. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేస్తోంది. పాలకమండలి ఆమోదం పొందితే...నూతన విధానం అమలులోకి రానుంది. అదనపు లడ్డులు కావాలంటే మాత్రం భక్తులు 50 రూపాయలు చొప్పున కొనుగోళ్లు చేయవల్సిందే. 


తిరుమలకు విచ్చేసిన ప్రతి భక్తుడు స్వామివారి దర్శనం తరువాత అధిక ప్రాధాన్యత ఇచ్చేది లడ్డు ప్రసాదానికే. మరెక్కడా లేని విధంగా శ్రీవారి లడ్డు ప్రసాదం విక్రయాలు తిరుమలలో జరుగుతాయి. శ్రీవారిని దర్శించుకునే భక్తులు సంఖ్య రోజుకు 60 వేల నుంచి లక్ష వరకు వుంటే... లడ్డు ప్రసాదాలు విక్రయం మూడున్నర లక్షల వరకు వుంటుంది. శ్రీవారి లడ్డు ప్రసాదానికి ఉన్న డిమాండ్ కారణంగా నకిలీ లడ్డుల తయారీ జరుగుతుండడంతో.... వాటిని అరికట్టేందుకు టీటీడీ 2009లోనే జియోఫ్రికల్  ఇండికేటర్ గుర్తింపు తీసుకు వచ్చింది. అప్పటి నుంచి నకిలీ బెడద తప్పినా... దళారుల దోపిడీ ఎక్కువైంది. శ్రీవారి భక్తులకు సబ్సిడీ ధరలపై ఇస్తున్న లడ్డులు దళారులకు కాసుల పంట పండిస్తున్నాయి. భక్తులకు అధిక ధరలకు లడ్డు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. దీనిపై సీరియస్‌గా దృష్టిపెట్టిన టీటీడీ దళారి వ్యవస్థకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది.


టీటీడీ నడకదారి భక్తులుకు ఒక లడ్డు, సేవా టిక్కెట్లు కలిగిన భక్తులుకు రెండు లడ్డులు ఉచితంగా అందిస్తోంది. అదనంగా లడ్డులు కావాలంటే 50 రూపాయల చొప్పున కొనుగోళ్ళు చేయవల్సిందే. ఇక వయోవృద్దులు, వికలాంగులైన భక్తులకు 20 రూపాయలకు రెండు లడ్డులును అందజేస్తారు. పరకామణి సేవలో పాల్గొన్న భక్తులకు 5 రూపాయలు చొప్పున నాలుగు లడ్డులను అందజేస్తుంది టీటీడీ. ఇలా లడ్డు ప్రసాదాలకు సంబంధించి 16 విధానాలలో భక్తులకు టోకెన్లు ఇస్తుంది టీటీడీ. 


లడ్డు ప్రసాదం విక్రయాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నా... ఏటా 200 కోట్లు భారం పడుతుందంటున్నారు టీటీడీ అధికారులు. దీంతో ముందస్తు ఆదాయ వనరులను పెంచుకునే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. ఇకపై శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఉచితంగా ఒక లడ్డు అందించనున్నారు. అదనపు లడ్డులు  కావాలంటే మాత్రం  50 రూపాయలు వెచ్చించాల్సిందే.  శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని ఉచితంగా అందించడం కారణంగా టీటీడీపై ఏటా 100 కోట్లు వరకు భారం పడే అవకాశం వుండగా.... 50 రూపాయలు చొప్పున లడ్డు విక్రయం ద్వారా వచ్చే ఆదాయంతో  దాన్ని అధిగమించవచ్చన్న భావనలో అధికారులున్నారు. అయితే టీటీడీ నూతన విధానంపై భక్తులు  మండిపడుతున్నారు. ప్రస్తుత విధానంలోనే ప్రసాదం అందించాలని కోరుతున్నారు. ఆర్థికభారం పేరుతో అదనపు భారం మోపడం సమంజసం కాదని భక్తులు వాపోతున్నారు. దీనిపై టీటీడీ పాలకమండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిని రేపుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: