రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమైన తరుణంలో అయోధ్య అభివృద్ధిపై అధికారులు దృష్టి పెట్టారు. అయోధ్యకు ఓ రూపు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తిరుమల తరహాలో తీర్చిదిద్దేందుకు ప్రాజెక్ట్‌ రెడీ అవుతోంది.
 
తిరుమల తరహాలో అయోధ్య రూపొందడానికి కనీసం నాలుగేళ్ల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. నగరం అభివృద్ధి కోసం త్వరలో అయోధ్య తీర్థ వికాస్‌ పరిషత్‌ ఏర్పాటు కాబోతోంది. సరయూ నదిలో జలవిహారం కూడా ఉండనుంది. అలాగే అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కానుందని, ఏప్రిల్‌లో జరిగే శ్రీరామ నవమి నాటికి ఇక్కడి నుంచి విమానాలు ప్రయాణాలు మొదలుకానున్నాయని చెబుతున్నారు. అయోధ్యలో ఇంటర్నేషనల్‌ బస్‌ టెర్మినల్‌తో పాటు అయోధ్య రైల్వే స్టేషన్‌ అభివృద్ధికి కూడా ప్రణాళికలు రూపొందించారు. 


అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఫైజాబాద్‌- అయోధ్య మధ్య 5 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపట్టనున్నారు.  భవిష్యత్‌లో అయోధ్య దేశంలోనే అతిపెద్ద మతపరమైన పర్యాటక కేంద్రంగా రూపొందనుంది. 2 వేల మంది రోజుకు 8 గంటల చొప్పున పనిచేస్తే రెండున్నరేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తవుతుందని అంచనా. మొత్తం 77 ఎకరాల ఆలయ ప్రాంగణంలో గోశాల, ధర్మశాల, వేద విద్యాలయం సహా ఇతర ఆధ్యాత్మిక  భవనాలను ఆలయానికి సమీపంలో నిర్మించనున్నారు. రాముడికి సంబంధించిన చెరువులన్నింటినీ పునరుద్ధరించాలని నిర్ణయించారు. 


అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఎపుడైతో వెలువడిందో రామభక్తుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ ఆధ్యాత్మిక నిర్మాణానికి సంంబంధించిన విశేషాలపై రోజుకో వార్త తెలుస్తుండటంతో భక్తుల్లో ఎక్కడలేని సంబరం నెలకొంది. మన దేశంలో ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో తిరుమల ఎంతో ప్రసిద్ధి గాంచింది. అలాంటి తిరుమల తరహాలో అయోధ్య నిర్మాణం ఉండనుందనే విషయం తెలియగానే రామ భక్తులు ఆధ్యాత్మిక చింతనలో మునిగితేలుతున్నారు. ఎపుడెపుడు అయోధ్య నిర్మాణం పూర్తవుతుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: